పింఛను కమ్యుటేషన్ సౌకర్యం పునరుద్ధరణ
భవిష్య నిధి సంస్థ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్,1938
దిల్లీ: పింఛనుదార్లకు ఊరట కలిగించేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకొంది. పింఛను కమ్యుటేషన్ (కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకునే) సౌకర్యాన్ని పునరుద్ధరించనుంది. గతంలో ఉన్న ఈ సౌకర్యాన్ని 2009లో రద్దు చేయగా, దానిని తిరిగి అమల్లోకి తీసుకురానుంది. 2009 ముందు పదవీ విరమణ చేసి, ఒకేసారి ఏకమొత్తంలో పింఛను తీసుకోవడానికి ఐచ్ఛికాన్ని ఇచ్చిన పింఛనుదార్లకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. కమ్యుటేషన్ అంటే... 15 ఏళ్ల పింఛనులో మూడో వంతును ఒకేసారి చెల్లిస్తారు. మిగిలిన సొమ్మే నెలవారీ పింఛనుగా వస్తుంది. 15 ఏళ్ల తరువాత మళ్లీ పూర్తిస్థాయిలో పింఛను అందుతుంది. ఈ విధానాన్ని పునరుద్ధరించడం ద్వారా దేశంలో 6.30 లక్షల మంది పింఛనుదార్లకు లబ్ధి కలుగుతుంది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి వజ్రేశ్ ఉపాధ్యాయ తెలిపారు. గతంలో ఈపీఎస్-95 పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు పదేళ్ల పింఛను మొత్తంలో మూడో వంతును పీఎఫ్ సంస్థకు అమ్ముకునే వీలుండేది. మిగిలిన మొత్తమే పింఛనుగా వచ్చేది. 15 ఏళ్ల అనంతరం మళ్లీ పూర్తిస్థాయి పింఛను లభించేది. దీనిలో మార్పులు చేయాలని విజ్ఞప్తులు రావడంతో తగిన నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించారు. పీఎఫ్ నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంపైనా చర్చలు జరిగాయి. గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్‌లో రూ.2,300 కోట్లను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకారం లభించింది.