APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF VOICE » అంతిమ సంస్కారాలకు కోసం అనాధ శవాల ఆర్తనాదాలు? :: నీరుకట్టు మోహన్ దాస్, ఏపీటీఎఫ్

అంతిమ సంస్కారాలకు కోసం అనాధ శవాల ఆర్తనాదాలు? :: నీరుకట్టు మోహన్ దాస్, ఏపీటీఎఫ్

Posted by Mohan
» APTF VOICE
» Sunday, 16 May 2021

 అంతిమ సంస్కారాలకు కోసం  అనాధ శవాల ఆర్తనాదాలు?

(ఉత్తరప్రదేశ్ విపత్తుపై కొన్ని వాస్తవాలు)


నీరుకట్టు మోహన్ దాస్, ఏపీటీఎఫ్

 (స్వీయ పరిశీలన)


మాకు గౌరవప్రదమైన చావును ప్రసాదించండంటూ ఇటీవల సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అయిన సందర్భంగా ఆ నేపధ్యాన్ని అంతర్జాలంలో శోధించా. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో ప్రజలు చావు తర్వాతి సంస్కారాలను గౌరవప్రదమైన రీతిలో జరిపించమని కోరడం బహుశా తొలిసారి కావచ్చు. మనిషి పుట్టుకను, పెళ్లిని, చావును ఒక ప్రత్యేక ఘట్టాలకు ప్రాధాన్యత ఇచ్చే సంప్రదాయం, సనాతన ఆచారాలు కలిగిన ఈ దేశంలో ఈ కోరిక బహుశా తీర్చిలేనిదేమీ కాదు. అయినా ప్రభుత్వాలకు ప్రపంచ గమనానికి కరోనా చావులు విషమ పరీక్షగా మారాయి. చాలామంది అంగీకరించరు కానీ, పేదరికమే అసలు పరీక్ష. ఆత్మగౌరవంతో బ్రతకాలని ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు ఇపుడు శవాల దహన సంస్కారం మట్టిలో కలిసేటపుడు గౌరవంగా ఉండాలని కోరుకొంటున్నారు.


వివరాల్లోకి వెళితే.....

ఖచ్చితంగా అక్కడున్న శవాల సంఖ్య తెలియదు. ఏ శవం ఎవరిదో తెలియదు. పలానా శవం తమ వారిదని ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2000 పైగా మృత దేహాలు. కరోనా సృష్టించిన విలయంలో ఎందరో అభాగ్యులు అనాధ ప్రేతాలయ్యారు. కాకులు, గద్దలు, రాబందులు శరీర భాగాలను ఎగరేసుకుపోతున్నాయి. కుళ్ళిన మృతదేహాల చుట్టూ కుక్కలు, ఇతర జంతువులు భక్షణ కోసం లంగరు వేసివున్నాయి. జంతు, పక్షి సమూహాలకు అక్కడో ఆహార జాతర వాతావరణం మానవత్వం ఉన్న మనుషులను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఏ నదీ సంగమంలో తలముంచితే పుణ్యం సంప్రాప్తిస్తుందని భారతావనిలోని ఒక వర్గం విశ్వసిస్తుందో ఆ ప్రదేశం ఇపుడు కుళ్ళిన మానవ కళేబరాలతో  విలవిల్లాడుతోంది. బ్రతుకు కోల్పోయిన దేహాలకు అంతిమ సంస్కారాలు చేసే ఆర్ధిక స్థితి లేకపోవడం వల్ల రక్త సంబంధీకులే ఆయా గ్రామాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో వదిలేసిన ఘటనలు. రోజుల తరబడి అలాగే ఉండిపోయిన దేహాలు కుళ్ళి కుక్కల ఆహార పోరులో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. తక్కువ నీటి మట్టంతో ప్రవహించే నదిలో కూడా అదే పరిస్థితి.


*ఒకనాటి చారిత్రక నగరం అలహాబాద్. ఇపుడు మారిన పేరుతో ప్రయాగరాజ్. గంగా యమునల సంగమ క్షేత్రం. ఇహలోకపు వాంఛలు వీడి పాప ప్రక్షాళనకు, పుణ్యలోక సంప్రాప్తికి సన్యసించేందుకు వెళ్ళే సాధు జన విరాజిత ప్రదేశం.  హరనామ సంకీర్తనలతో మార్మోగే దేవభూమిగా విశ్వసించే పవిత్ర భూతలం. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో 1140 కిలోమీటర్ల గంగానది పరీవాహ ప్రాంతం. ఆకాశపు అంచులు తాకిన చెట్ల నుంచి వచ్చే సువాసనల పరిమళాలు స్థానే కుళ్ళిన దేహాల నుంచి దుర్గంధపు ఉష్ణవాయువులు వెలువడుతున్నాయి. కనీసం ఇద్దరు మనుషులు ఒకచోట నిలబడలేని గ్రామాల్లో భీతావహ దృశ్యం. బిజానూర్,  మీరట్, కన్వారా, ఉన్నవ్, ఘజీపూర్, బిలియా, కనోజ్, ఫతేపూర్ మొదలైన ప్రాంతాల్లో భీతావహ దృశ్యాలు మానవ అభివృద్ధిని,  నాగరికతను, మేధస్సును వెక్కిరిస్తున్నాయి.


"తొలినాళ్లలో రోజూ ఆరేడు శవాలను దహించేవాళ్ళం, ఇపుడు వంద దాటాయి. ఉన్న రెండు స్మశాన వాటికలు చాల్లేదు. పైపెచ్చు ఒక క్వి0టాల్ కట్టెలు కనుగోలుకు ఆరొందలు అవుతుంది. రవాణా అంతా కలిపి వేల రూపాయలు ఖర్చవుతుంది. అంత డబ్బులు ఖర్చుచేసే స్థితి మృతుల కుటుంబాలకు లేదు. కొందరైతే ప్రేత వస్త్రం కొనలేని దైన్య స్థితి. అందుకే  శవాలను పడేసి వెళ్తున్నారు". అని స్థానిక దళిత నాయకుడు, పూర్వపు ఎమ్మెల్యే నంద కిషోర్ రామ్ చెప్పిన మాటలు అక్కడి పాలకులు చెప్పే అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి. ప్రజల భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయి.


2021, మే మొదటివారం. మీడియా ఆ ప్రాంతపు స్థితిని ప్రపంచపు దృష్టికి తెచ్చేదాకా అంతా సవ్యంగానే వున్నట్లు కనిపించింది.  దైనిక్ భాస్కర్ (హిందీ దిన పత్రిక) ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫ్రీ ప్రెస్ వంటి ప్రచురించిన కధనాలు, బీబీసీ వంటి ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు అక్కడి దుస్థితిని కళ్ళకు కట్టాయి. ప్రపంచపు నలు దిక్కులను తట్టి లేపాయి. కన్నీరు నింపుకున్న దేశాన్ని తేరిపారా చూశాయి. ప్రభుత్వాల మౌనానికి స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖకు తాఖీదులు పంపడంతో శవాలను, విడిపోయిన దేహ భాగాలపై ఇసుకను కప్పేందుకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అహోరాత్రులు శ్రమించాల్సి వచ్చింది. గోరీలపై కప్పిన ప్రేత వస్త్రాలు కరోనా చేసిన మానవ హననాన్ని గుర్తించేలా చేశాయి. 


20 కోట్ల జనాభా, 71 జిల్లాలు, 81 పార్లమెంట్ నియోజక వర్గాలు, 403 శాసనసభ స్థానాలతో దేశ రాజకీయాలను శాసించే ఆ  రాష్ట్రపు అభివృద్ధి కొలమానాలను ప్రశ్నార్ధ0లో పదేశాయి. ఇపుడు అక్కడి ప్రజా భయం గుప్పిట్లో ఉంది. పల్లెల్లో అభద్రత తాండవిస్తోంది. తూర్పు ఉత్తర ప్రదేశ్ జిల్లాల జీవన ముఖ చిత్రం పూర్తిగా ఛిద్రమైంది. 


గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ స్థానం ఈ విపత్తులో ఒక భాగమవడం సాధారణ విషయం. అంతే కాదు సంసద్ గ్రామ యోజన కింద 2018లో  ప్రధానమంత్రి మోడీ గారు దత్తత తీసుకున్న డోమ్రి గ్రామం కూడా ఈ ఉత్పాతంలో ఒక ప్రత్యక్ష సాక్ష్యం కావడం విశేషం. 

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |