#విద్యారంగానికి_ఉపాధ్యాయులకు_చేదు_జ్ఞాపకాలను_మిగిల్చిన_2022
"పాముకు కాటేసే పని, తేలుకు కుట్టే పని, ఎండ్రకాయకు రక్కే పని" అన్నాడు మునుపటికో పెద్దాయన! కానీ ఆయా జీవులు తమ మనుగడకు ఇబ్బంది కలుగుతుందనో, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భావించినపుడు మాత్రమే వాటిలో ప్రతీకార ప్రతిస్పందన కనిపిస్తుంది. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విషపూరిత సర్పాలను తలపించేలా భావిస్తున్న వాటికంటే ప్రమాదకరమైన వారు విద్యాశాఖలో అధికారులై తిష్టవేశారు. వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడంలో వారు ఎత్తిన పిడుగులు. టీచర్లను వేపుకుతినడంలో నలమహారాజంతటి చేయి తిరిగిన వారు సదరు మేధావులు. సామాజిక స్పృహతో, ఎంతో గంభీరంగా కొన్ని దశాబ్దాలుగా జీవనదిలా సాగిపోతున్న విద్యారంగంలో రెండు దశాబ్దాల కిందట ఆరంభమైన తిరోగమన విధానాలు ఇపుడు తారాస్థాయికి చేరాయి. కార్పొరేట్ దున్నుతో నడపబడుతున్న ప్రభుత్వాలు తమ శక్తివంచనమేర విద్యారంగాన్ని పడగొట్టేందుకు
విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కొత్త సంవత్సరం. అయినా మాయని గాయాలు, మారని గాధలు గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవలసిందే! మధురస్మృతులైతే కొన్ని ఘడియలు స్మరించుకుని విస్మరించవచ్చు. కానీ గతంలో నాటిన విషపు మొక్కలు రేపటిరోజున బీజాలను వెదజల్లి తమ పునరుత్పత్తితో సమాజపు విజ్ఞానకాంతులను శాశ్వత గ్రహణంలా కబళి0చబోతుంటే ఒక సామాజిక వాదిగా వడిగా, వాడిగా, వేడిగా స్పందించక తప్పనిసరి. విద్యావ్యవస్థకు, ఉపాధ్యాయవర్గానికి సమీప భవిష్యత్తులో కాళరాత్రులే కనిపిస్తున్నాయి.
తెలుగు మాధ్యమం రద్దు
భాషా ప్రయుక్త రాష్ట్రంలో ప్రజల గొంతుకే భాష. ఆ భాషను బోధనా మాధ్యమంగా రద్దు చేయడమంటే ఆ గొంతుకను నులిమేయడమే. ప్రాచీన కాలం నుంచీ పామరుల మొదలు పండితులు వరకు ఒడిసిపట్టిన భాషను దెబ్బతీశారు. జాతీయస్థాయిలో గుర్తింపు కలిగి అంతర్జాతీయ వేదికలపై సత్కారాలు అందుకునేందుకు ఉన్న ఆధారాన్ని తెగేశారు. కేవలం తమ మాట చెల్లాలని పాలకులు పెడధోరణిని ఎంచుకున్నారు కానీ తాము చేస్తున్నది ఎంతటి తప్పిదమో, ఎందటి పరిపక్వ విధానమే వారు గుర్తించలేకున్నారు. విద్య పాలకులకు లాభసాటి వ్యాపారం కాదు. అందుకే అందులో వ్యయాన్ని తగ్గించుకొని తమ ప్రాధాన్యతలకు నిధులు దారి మల్లించాలని చూస్తున్నారు. అందుకే టీచర్ పోస్టుల రద్దు ద్వారా బడ్జెట్ ను తమ అదుపులో ఉంచుకునేందుకు వ్యూహాత్మకంగా మాధ్యమం రద్దు సాహసానికి ఒడిగట్టారు.
*బోధనలో భాష ఒక వరం. మాధ్యమం అనేది జీవనాడి. అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు తమ ప్రకంపనల మార్పిడికి పరస్పరం సహకరించే వాహక తంత్రి.* దాన్ని భంగపరిచే యత్నంపై తెలుగోడి గొంతుక ఒక్కటై నినదించాలి. భాష రక్షణకు నడుం బిగించాలి. తెలుగు బోధనా మాధ్యమం రద్దుపై మొత్తంగా ఒక మహోద్యమం రావాల్సిందే!
√ విద్యా వ్యవస్థకు సవాలు విసిరిన జీఓ 117
జాతీయ విద్యా విధానం 2020 అమలు విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాలతో సహా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చూసీచూడనట్లున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం వద్ద ఆగ్రాసనం పొందేందుకు పరుగులు పెట్టింది. కనీస చర్చ జరక్కుండా పార్లమెంటులో ఆమోదం పొందిన విద్యా విధానంపై రాష్ట్రంలో మేధావి వర్గంతో కానీ, ఉపాధ్యాయ సంఘాలతో సాధారణ చర్చ కూడా జరగలేదు. దానివల్ల వచ్చే ఉపద్రవాన్ని ముందస్తుగా అంచనా వేయలేదు. కనీసంగా అధ్యయనం లేకుండా విద్యారంగంపై పిడుగులా పడింది. ప్రధానంగా 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంలోనూ తప్పటడుగులు పడ్డాయి. ఎంతో బలంగా ఉన్న ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కవుదుటన అధఃపాతాళానికి పడిపోయింది. టీచర్లను మిగులు తేల్చే పధకం విజయవంతం చేశారు. నాడు-నేడు పధకం ద్వారా నిండిన పాఠశాలలను ప్రభుత్వ చర్యల పర్యవసానంగా వెలవెల పోయే పరిస్థితికి దారితీసింది.
√ పదోన్నతులు
ప్రతినెలా మొదటి వారంలో తొలి పనిదినం రోజున ఏ విధంగా ఏర్పడిన ఖాళీలనైనా పదోన్నతుల ద్వారా 70:30 నిష్పత్తిలో నింపాలనేది గత ప్రభుత్వాలు రూపొందించిన నిబంధన.
కానీ దాన్ని ఇప్పుడు ప్రహసనంగా మార్చేస్తున్నారు. సాంకేతికత పేరుతో పదోన్నతుల ప్రక్రియ ముగిసినా అందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. జిల్లా స్థాయిలో పూర్తయ్యే వ్యవహారం ఇపుడు కమీషనర్ స్థాయికి చేరిపోవడం చిత్రంగా లేదూ!
√ కేడర్ల అయోమయం
అంతటితో ఆగలేదు. పాఠశాల స్థాయిని బట్టి అక్కడ పనిచేయాల్సిన ఉపాధ్యాయుల కేడర్ ను ఎప్పుడో నిర్ణయించారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు (వివిధ సబ్జెక్టుల), ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్లు నియమించే విధానం ఉంది. ఆమేరకు 2002 నవంబర్లో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ లను పెద్దయెత్తున రీ డిప్లాయ్మెంట్ చేసి ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు పంపారు. ఇప్పుడేమో 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్స్ అంటున్నారు. 98 కంటే తక్కువగా విద్యార్థులున్న పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను, ప్రధానోపాధ్యాయులను, వ్యాయామ ఉపాధ్యాయులను తప్పించేస్తున్నారు. పంచతంత్ర కథల్లో కూడా లేని ద్వంద్వనీతిని అనుసరించడాన్ని ఏమనాలి? ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల సంఖ్యకు కత్తెర వేసే పన్నాగం ఇది. ఉపాధ్యాయ శిక్షణలోనే స్పష్టమైన తేడాలుండగా దాన్ని గుర్తించకున్నారు. అంతేకాకుండా పి.ఎస్. హెచ్. ఎం. పోస్టులు కూడా ఇక కాలగర్భంలో కలుసిపోనున్నాయి.
√ ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం 2010)
2010 సంవత్సరం సరిగ్గా ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్స్ అంటూ కొంటె కోణంగులు జరుపుకునే పండుగారోజున విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఒక పుష్కర కాలం తర్వాత కూడా ఆ చట్టం ఫలితాలు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే పాఠశాలలకు అందడం లేదు. అందులో ప్రధానమైనది తరగతికో ఉపాధ్యాయుడు, పదిశాతం పేద పిల్లలకు ప్రయివేట్ పాఠశాలలల్లో విద్యాభ్యాసం అందించడం, ఆవాసానికి అందుబాటులో పాఠశాలలు ఏర్పాటు చేయడం. ఇవన్నీ నీటిమూటలుగా మిగిలిపోయాయి.
√ సృజనాత్మక బోధనా పద్దతులతో తరగతి గదిలో స్వేచ్ఛగా పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఇపుడు అణువణువునా శల్య పరీక్షలు చేస్తున్నారు. అనుమానపు విధానాలు సృష్టించి అవమానిస్తున్నారు. మెరుణగధీరుల్లా సగర్వంగా తలెత్తుకుని గంభీరంగా సాగే ఉపాధ్యాయులు ఇపుడు తాము పనిచేసే ఊర్లోనే బిత్తరచూపులతో తడబడే నడకలతో సాగుతున్నాడు. విద్యార్థులను ప్రయోజనవంతులుగా తీర్చిదిద్దే బాధ్యతలు కాకుండా నిస్సహాయులయారు.
ఎన్నో ఉత్తానుపతనాలను చవిచూసిన ఉపాధ్యాయలోకం ఇపుడు చాలా కలవరపడుతోంది. ప్రభుత్వ చర్యలే ఇందుక్కారణం. అధికారుల వైఖరులే వారిని బలహీనులుగా మార్చేసాయి. ఉపాధ్యాయుల దైనందిన జీవితాలు బోధనకు బదులు సెల్ ఫోన్ ద్వారా యాపులు వేసే గుదిబండతోనే సరిపోతుంది. ముఖ హాజరు, డైరీ రాయడం, విజిట్లు, పాఠ్యప్రణాళికలు పేరుతో వారిని భయకంపితులను చేసేస్తున్నారు. శిక్షణకు హాజరైనా కనీస భత్యం, చార్జీల చెల్లింపుల్లేవ్. ఫోన్ ఇంటర్నెట్ ఉపాధ్యాయుల జేబు నుంచి చెల్లించాలి. ఈ రుస్తుం విధానం ప్రజా ప్రభుత్వాల నైతికతను ప్రశ్నిస్తోంది. అలానే ఉపాధ్యాయుల విశ్వసనీయత ప్రశ్నార్ధకమవుతోంది. పోనీ నెలవారీ అయినా జీతాలు సక్రమంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. సమాజంలో ఉపాధ్యాయులు ఆర్ధిక విశ్వసనీయత కోల్పోయారు.
√ సాధారణ పరిపాలనా శాఖ ప్రతియేటా సెలవులను నిర్ధారిస్తుంది. ఆ ఉత్తర్వులను అన్నిశాఖలు విధిగా పాటించాలి. కానీ విద్యా శాఖ రూటే వేరు. జీఓ ను తమ చెప్పుచేతల్లోకి తీసుకొని ప్రత్యేకంగా సర్క్యులర్లు ఇస్తూ జీవోలను ఉల్లంఘించడమే కాకుండా ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తోంది. ప్రకృతి వైపరీత్యాలవల్లనో, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లోనో మార్పులు చేర్పులు ఆహ్వానించవచ్చు. కానీ ప్రతి విషయాన్ని రాద్దాంతం చేయడం, సంఘాలు వెళ్లి సహస్ర విజ్ఞాపనలు ఇవ్వడం పైనుంచి కిందకు మార్పుల సమాచారం అందేటప్పటికి పుణ్యకాలం గడిచిపోవడం చాలా సందర్భాల్లో చూశాం.
√ పరీక్షల నిర్వహణలోనూ తొట్రుపాటు!
విద్యాసంవత్సరం మొదలైన తర్వాత పరీక్షల నిర్వహణలో విపరీతమైన కాలయాపన జరిగింది. ఇప్పటికే మూడు సమ్మెటివ్ పరీక్షలు రెందుకు కుదింపబడ్డాయి. కొత్త యేడాదిలో అయినా సంస్కరణలు రావాలని కోరుకుందాం.
√ 2022 బదిలీల ప్రహసనం
2022 లో బదిలీలు నిర్వహణకు ఏ ముహూర్తాన ఉత్తర్వులు వెలువడ్డాయో కానీ సవాలక్ష సమస్యలు సృష్టించాయి. దీర్ఘకాలికంగా బదిలీలకోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుత పరిస్థితి ఆశనిపాతంగా పరిణమించింది. ఉపాధ్యాయుల ప్రయోజనాలకు విఘాతం కలిగిన దరిమిలా వేలాదిమంది కోర్టు మెట్లెక్కారు. ఎన్నో సవరణలు వచ్చినా చట్టాలను సంతృప్తి పరచలేకపోయాయి. మొత్తానికి బదిలీలు జరిగే వాతావరణం ఇప్పట్లో లేనట్లే!
పీఆర్సీ, కరువుభత్యం, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై ఎంత మాట్లాడితే అంత కంఠశోష! ప్రభుత్వ బలం ముందు సంఘాల కార్యశీలత నిష్క్రియాపరత్వమైంది. ప్రభుత్వ అనుకూల సంఘాల మొకరిల్లే విధానంవల్ల మరెన్నో చేజార్చుకునే ప్రమాదం ఏర్పడింది. మున్ముందు రోజుల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడితే తప్ప పోగొట్టుకొంటున్న ప్రయోజనాలు, చేజార్చుకున్న హక్కులు పునరుద్ధరింపబడే అవకాశం లేదు. ఉవ్వెత్తున ఎగిడిపడిన పీఆర్సీ ఉద్యమంతో ప్రారంభమైన 2022 కనీస ఫలితాలను రాబట్టుకోలేకపోగా ఉన్నవి జరవిడుచుకున్న విపత్కర పరిస్థితి నుండి బయటపడాలి.
-మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్ 1938