APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF » 6.1.2020 మార్పు బాలకృష్ణమ్మ ఏడో వర్థంతి సందర్భంగా... స్మృతి

6.1.2020 మార్పు బాలకృష్ణమ్మ ఏడో వర్థంతి సందర్భంగా... స్మృతి

Posted by APTF 1938
» APTF
» Monday, 6 January 2020


  • రైతాంగం కోసం పోరాడిన గురువు మార్పు బాలకృష్ణమ్మ
  • ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉద్యమ తొలి గురువు మార్పు
  •  ఫెడరేషన్ బావుటాను ఎగరేసిన మార్పు
  • చెన్నుపాటి మార్గంలో చరితార్థుడు మార్పు


6.1.2020 మార్పు బాలకృష్ణమ్మ ఏడో వర్థంతి సందర్భంగా... స్మృతి

-సన్నశెట్టి రాజశేఖర్, ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు 94404 36703

"మార్పు కోసమే మన పయనం. మౌలిక మార్పే మన గమ్యం. అసమానతల వర్గ సమాజం మారాలన్నదే అంతిమ ధ్యేయం"

 ఇదే మార్పు  బాలకృష్ణమ్మ చిరకాల ఆకాంక్ష. విద్యారంగంలో ఆయన ఫెడరేషన్ బావుటా. చెన్నుపాటి లక్ష్మయ్య చూపిన మార్గంలో నడిచిన చరితార్థుడు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉద్యమ తొలిగురువు. ఇదీ  ఆయన గురించి అందరికీ తెలిసిన చరిత్ర. కానీ కొద్దిమందికే తెలిసున్నఆయన కనపరిచిన పోరాట పటిమ, రైతాంగ పక్షపాతం, ప్రజలతో మమేకత బాలకృష్ణమ్మ అమరత్వం చెంది ఈ ఏడాది జనవరి ఆరో తేదీకి ఏడేళ్ళు నిండుతున్న సందర్భంగా గుర్తు చేసుకోవడం  బాధ్యతగా భావించి దారి దీపమైన బాలకృష్ణమ్మ  సమాజానికి అందించిన విలువలను ఈ వ్యాసం ద్వారా స్మృత్యంజలి ఘటించడం నేటి తరం కర్తవ్యం .... . పోరాటాల్లో నిత్య చలన శీలతను రగిలించే ఉద్యమ యోధుని గత జ్ఞాపకాలను మీ ముందుకు...



బాల్యంలోనే ఉద్యమానురక్తి

1930 జూన్ 13 వ తేదీన శ్రీకాకుళం జిల్లా మందస మండలం భిన్నల మదనాపురంలో జన్మించిన బాలకృష్ణమ్మ తండ్రి రైతాంగ విప్లవ వైతాళికుడు మార్పు పద్మనాభం నుండి కమ్యూనిస్టు రాజకీయాలను వంటపట్టించుకున్నారు. కష్టజీవుల పక్షపాతిగానే బాల్యం నుంచే నిలబడ్డారు. మరణించిన నాటి వరకూ అదే రాజకీయ ఒరవడిలో రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమంలో ఇతర ప్రజా సంఘాలతో కలిసి పనిచేశారు. భారత దేశంలో   ప్రజాతంత్ర విద్యా విధానం కోసం పోరాడుతున్న శ్రేణులంతా ఆయన ఆశయాల వారసులుగానే చెప్పుకోవాలి. ఆయన చదువుకుంది ఎనిమిదో తరగతే....కానీ విశ్వవిద్యాలయాల ఆచర్యులు సైతం ఈయనకు శిష్యులే.వీరగడ్డగా చరిత్రకెక్కిన మందస ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుండగానే పోరాటం వైపు బాలకృష్ణమ్మ దృష్టి మళ్ళింది. ఇంటి బాధ్యతలు సైతం ఆయన్ని చుట్టుముట్టాయి.1947-48 విద్యా సంవత్సరంలోనే బాలకృష్ణమ్మ పాఠశాల విద్యకు స్వస్తి పలికి ఉద్యమ బాట పట్టారు. 1940 లో ఈ నేలపైన సాగిన వీరోచిత రైతాంగ పోరాట సంఘటనగా నిలిచిన వీరగున్నమ్మ తెగువ, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారి నాన్నగారైన మార్పు పద్మనాభం గారు కనపరచిన నాయకత్వ పటిమ బాలకృష్ణమ్మ ను బలీయంగా ప్రభావితం చేశాయి.మందస జమీన్ వ్యతిరేక రైతుల పోరాట ఘట్టాలు ...నిత్యం రైతులు తన తండ్రిగారిని కలవడానికి వస్తున్న పరిస్థితులు కూడా బాలకృష్ణమ్మ ను దిశానిర్దేశం చేశాయి. అందుకే ఆ రోజుల్లో తాను కూడా రైతాంగ పోరాట యోధులతో పాటు రహస్య జీవితాన్ని  గడపవలసి వచ్చింది. తన పదహారవా యేటనే రహస్య జీవితానుభవాన్ని పొందారాయన.క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మందస రాజా వారి ఉన్నత పాఠశాలను తగలబెట్టిన సంఘటనలో బా‌లకృష్ణమ్మ గారూ వున్నారు. మందసకు చేరువలో వున్న మహేంద్ర తనయ బ్రిడ్జిని పేల్చి వేసే సంఘటనలోనూ ఆనాడు బాలకృష్ణమ్మ భాగస్వామయ్యారు.తండ్రి పద్మనాభం స్ఫూర్తితో సాంస్కృతిక ప్రచార దళాల్లో కళాకారునిగా పాటలను పాడుతూ గ్రామ గ్రామాన తిరిగిన బాల కలాకారుని జీవితాన్ని గడిపేరు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ ప్రచారంలోనూ బాలకృష్ణమ్మ పాత్ర వుంది.బాలకృష్ణమ్మ గారి చదువు తొమ్మిదో తరగతిలోనే ఆగిపోవడానికి మరో కారణం....బాలకృష్ణమ్మ గారి తల్లి చిట్టమ్మ గారు మృతి వారి కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. తల్లి బాధ్యతలన్నీ పెద్ద కుమారుడైన బాలకృష్ణమ్మ పైన పడ్డాయి. తండ్రి పోరాటంలో నిత్యం నిమగ్నమై వుండటం..... ఇంటి బాధ్యతలన్నీ బాలకృష్ణమ్మ చూడాల్సిన అనివార్య పరిస్థితులే బాలకృష్ణమ్మ చదువు మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది. అలా ఈ కుటుంబ బాధ్యతలను చూస్తూనే....తన స్వస్థలమైన భిన్నళ మదనాపురంలోని ఒక ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలో అన్ ట్రైయిన్డ్ టీచర్ గా 15 రూపాయల వేతనంతో విద్యారంగంలో బోధకునిగా అడుగు పెట్టాడు బాలకృష్ణమ్మ.

పోరాటమే జీవితం

మార్పు బాలకృష్ణమ్మ విద్యార్థిదశ నుండే ప్రగతి భావాలను ఆకలింపజేసుకున్నారు. ఉపాధ్యాయ శిక్షణ అనంతరం ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా చేరి ఉపాధ్యాయ ఉద్యమంలో చేరారు. తర్వాత ఆయన ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడిగా చరిత్రను సృష్టించారు. ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ను 1960లో ప్రారంభించి మిలిటెంట్ పోరాటాలను నడిపించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో ధర్నా వంటి కొత్త పోరాట రూపాలను ప్రవేశపెట్టి విజయం సాధించారు. మార్పు బాలకృష్ణమ్మ 1969 జూన్‌లో గుడివాడలో జరిగిన ఎపిటిఎఫ్ సభల్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1970లో పార్వతీపురం కుట్రకేసులో అరెస్టయ్యారు. రెండున్నర సంవత్సరాల పాటు సోంపేట, విశాఖపట్నం, రాజమండ్రి తదితర జైళ్లలో నిర్బంధాన్ని అనుభవించిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. 1974 నుండి 1985 వరకూ ఉత్తర సర్కార్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులుగా కొనసాగారు. శాసనమండలి ప్రోగ్రెసివ్ డెముక్రటిక్ ఫ్రంట్‌కు నాయకుడిగా ఉండి శాసనమండలిని ఉపాధ్యాయ ఉద్యమ వేదికగా మార్చగలిగారు. 1987లో ఎపిటిఎఫ్‌ను పునర్వ్యవస్థీకరించిన తర్వాత 2008 వరకూ ప్రధానకార్యదర్శిగానూ కొనసాగారు. ఉపాధ్యాయ ఉద్యమ నేతగా అనేక విజయాలను సాధించారు.

మందస రైతాంగ పెన్నిధి

మార్పు బాలకృష్ణమ్మ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా వున్న కాలంలోనే మందస ప్రాంతంలోని రైతాంగ ఆకాంక్షల సఫలతకు పోరాట మార్గాన్ని అక్కడ రైతాంగానికి సూచించారు.పోరాట బాటలో పయనిస్తూనే....రైతాంగ సమస్యలపై యమ్మెల్సీగా శాసన మండలిని వేదికగా చేసుకొని రైతాంగ ఆకాంక్షలను ప్రకటించారు.శ్రీకాకుళం జిల్లా లోని మందస, సోంపేట మండలాల రైతాంగ చిరకాల కోరికలైన సాగు నీరు-తాగు నీరు శాశ్వత పరిష్కారం కోసం 1984 నుంచి 1987 వరకూ అవిశ్రాంత పోరాటాన్ని  చేపట్టారు. కళింగదళ, డబార్శింగి సాగు నీటి ప్రాజెక్టుల సాధనలో బాలకృష్ణమ్మ పట్టు వీడని పోరాట పటిమను కనపరిచారు.రైతాంగ ఆశల పల్లవయ్యారు.


మార్పు స్మారక గ్రంథాలయం ఏర్పాటు లో బాలకృష్ణమ్మ  చొరవ

శ్రీకాకుళ రైతాంగ విప్లవ వైతాళికుడైన మార్పు పద్మనాభ గారి ఆశయాల విస్తృతికి దోహదపడే రీతిలో హరిపురం గ్రామంలో పద్మనాభం స్మారక గ్రంథాలయం అభివృద్ధికి తోడ్పడుతూ...ఆ కమిటీకి ఆయన గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. 1996 లో నిర్మించిన ఈ గ్రంథాలయ ఆవిష్కరణకు ఆవిష్కర్తగా వావిలాల గోపాలకృష్ణయ్యను తీసుకు రావడానికి మార్పు చొరవే కీలకం. ఆనాటి బహిరంగ సభకు కన్నాభిరాన్, హరగోపాల్, జ్వాలాముఖి వంటి ప్రముఖులను సైతం వక్తలుగా తీసుకు రావడానికి బాలకృష్ణమ్మ కృషి వుంది.ఈ రోజు హరిపురం కేంద్రంలో అరుణారుణ బావుటాను ఎగరేస్తూ.... గ్రంథాలయం కొనసాగతున్న ప్రక్రియలో బాలకృష్ణమ్మ క్రియాశీలత ఎంతోవుంది. మార్పు పద్మనాభం స్మారక విగ్రహాన్ని నెలకొల్పడమే కాకుండా మార్పు కోసం పేరుతో ఒక స్మారక సంచికనే తీసుకురావడంలో బాలకృష్ణమ్మ పట్టుదల వుంది. ఈ సంచికను ఆయనే స్వయంగా బాధ్యత వహించి చెన్నై లో ముద్రించడం ఆయన కార్యదీక్షకు తార్కాణం.



ఏ.పి.టి.యఫ్ ఉద్యమ ఘట్టాల్లో మార్పు

1969  జూన్ 3, 4, 5 తేదీలలో గుడివాడలో సాగిన  ఫేడరేషన్ రాష్ట్ర మహా సభలలో చెన్నుపాటి స్థానంలో అప్పటికి ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాతగా వున్న మార్పు బాలకృష్ణమ్మ ఫేడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1980 లో యం యల్ సిగా మార్పు తిరిగి ఎన్నికయ్యారు. 1981  మార్చిలో ఫెడరేషన్ అధ్యక్షులుగా వుంటూ... శాసన  మండలిలో పి డి యఫ్ నాయకునిగా కూడా బాధ్యత వహించారు మార్పు బాలకృష్ణమ్మ. ప్రపంచ తెలుగు మహాసభలు... కోలాలంపూర్ లో ఉద్యమ నాయకునిగా  పోల్గొన్నారు.1983లో ఏ.పి.టి.యఫ్ అధ్యక్షులుగా వున్న మార్పు బాలకృష్ణమ్మ   ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ గా ఎన్నికయ్యారు. 1985 ఆగష్టు 19 న సెక్రటేరియట్ ముందు జరిగిన పికీటింగ్ లో ఫ్యాప్టో సెక్రటరీ జెనరల్గా మార్పు బాలకృష్ణమ్మతో బాటు వందలాది మంది కార్యకర్తలు పోలీసుల లాఠీఛార్జ్ కు గురయ్యారు. 3 వేల మంది ఉపాధ్యాయులు నిర్బంధానికి గురైన ఉద్యమ   పోరాట ఘట్టాలు చరిత్రకెక్కేయి.

ఏపీటీఎఫ్ పునర్ వ్యవస్థీకరణలో కీలకం ' మార్పు'

1987 : ఆగష్టు -విశాఖపట్నంలో ఎ.పి.టి.యఫ్ 14 వ విద్యా మహాసభల్లో  ఎ.పి.టి.యఫ్. పునర్వ వ్యవస్దీకరణ జరిగింది. అధ్యక్షులుగా పిళ్లా సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా మార్పు బాలకృష్ణమ్మ ఎన్నికయ్యారు. ఫెడరేషన్ అనివార్యంగా చీలికకు గురయింది.1938 సంఖ్యతో ఏపీటీయఫ్ పునర్వ్యవస్థీకరించడానికి ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శించి బాలకృష్ణమ్మ తన నాయకత్వాన్ని ఆ సంస్థ ద్వారా అందిస్తూ చరిత్రలో తనకు ఎదురులేదని నిరూపించారు. ఎ.పి.టి యఫ్ అధికారిక పత్రికగా "ఉపాధ్యాయ ప్రగతి" ని అప్పటినుంచే ప్రారంభించి తమ వాణిని వినిపించే సాధనాన్ని సైతం ఉపాధ్యాయ ఉద్యమానికి ఆయన అందించారు.

*2008 : ఫిబ్రవరి 10 న రాష్ట్ర కౌన్సిల్ లో మార్పు బాలకృష్ణమ్మ ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి ఐచ్ఛికంగా విరమణ  పొందేరు.2008 : అదే రోజున ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా  సన్నశెట్టి రాజశేఖర్ (శ్రీకాకుళం), ఎమ్.బాలన్న (కర్నూలు) లు ఎన్నికయ్యారు. ఏ.పి.టి.ఎఫ్ సలహాదారులుగా మార్పు బాలకృష్ణమ్మ తన తుదిశ్వాస వరకూ కొనసాగి ఫెడరేషన్ బావుటాను ఎగరేసిన ధీరుడయ్యారు.

పోరాట కెరటం అమరత్వం

ఉత్తరాంధ్ర నుంచి ఒక ఉద్యమ కెరటం అంచెలంచెలుగా ఎదుగుతూ.... విద్యారంగంతో పాటు ప్రజాతంత్ర పోరాటాల్లో సైతం తన వాణిని బలీయంగా వినిపించి,పోరాడిన ఉపాధ్యాయ ఉద్యమ యోధుడు  మార్పు బాలకృష్ణమ్మ గారు జనవరి 6, 2013 న హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సను పొందుతూ... రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు.భౌతికంగా ఆయన లేని లోటును ఉపాధ్యాయ ఉద్యమంతో పాటు ఇతర రంగాల ఉద్యమాల్లోనూ లోను తీర్చలేనిదిగానే మిగిలింది. మార్పు వారసులంతా ఆయన చూపిన మార్గాన నడిచి పోరాట బావుటాను బలంగా ఎగరేసే సంకల్పంతో కూడిన ఆచరణే బాలకృష్ణమ్మ గారికి అందించే ఘనమైన నివాళి అవుతుంది.

మార్పు బాలకృష్ణమ్మ స్మృతి గీతం

 జోహారులు..... జోహారులు....
 మా ప్రియతమ నేతకు జోహారులు
 మార్పు బాలకృష్ణమ్మ జోహారులు
 పద్మనాభ చిట్టమ్మ ల తొలి పుత్రుడు మార్పు
 భిన్నళ మదనాపురం లో తొలిపొద్దు మార్పు
 వీరగడ్డ మందసకే వన్నె తెచ్చిన మార్పు
టీచర్  ఫెడరేషన్ కు పెద్దదిక్కు మార్పు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉద్యమ తొలి గురువు మార్పు 
మందస రైతాంగానికి ఆశల పల్లవి మార్పు
 చెన్నుపాటి మార్గంలో చరితార్థుడు మార్పు
 ఫెడరేషన్ బావుటాను ఎగరేసిన మార్పు
 ఏడు దశాబ్దాల  వేగుచుక్క మార్పు
  ఉపాధ్యాయ లోకానికి వెలుగు బాట మార్పు
 తరతరాల స్మృతి గీతం అమరజీవి మార్పు.

మార్పు బాలకృష్ణమ్మ  గురించి మరి కొన్ని విశేషాలు, ఫోటోలు


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |