నిజాలు మాట్లాడడం ఒక సవాల్ లాంటిది..
ఎన్. మోహన్ దాస్, ఏపీటీఎఫ్ 1938
ఒక సత్యాన్ని నిరూపించేందుకు సాక్ష్యమిస్తే ఏ రూపంలో అయినా లేపేస్తారు. అందుకే గొంతెత్తి మాట్లాడడానికి, గళం విప్పి ప్రశ్నించదానికి ఎవరూ సాహసించడం లేదు. నిబంధనలు అమలుచేయాలని పట్టుపట్టడం అంటే జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడి ముందడుగు వేయాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, రాజ్యపాలకులు తమ అస్థిత్వంపై దాడి జరిగినట్లుగా భావించి పడగలు విప్పి బుసలు కొడతారు. అవసరమైతే విషం కక్కుతారు. రాజద్రోహులుగా ముద్రవేసి కారాగారంలో బంధిస్తారు. శాశ్వతంగా ఇక చిత్తమూర్తులు బయటికి రారు. వృద్ధాప్యం వచ్చేదాకా, వ్యాధులు చుట్టుముట్టేదాకా, శరీరం శుష్కించే దాకా చీకటి గుహల్లో నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ బద్ధమే.. అది ప్రజాస్వామ్య పాలనా, రాచరికమా అనేది కాదు సమస్య. ప్రశ్నించడం అంటే తమ అజెండాకు ఎదురు నిలవడం. ప్రశ్నించడం అంటే తమ రాజకీయాలను కుదుపుకు గురిచేసే ప్రయత్నం చేయడం. భారత రాజకీయ యవనికపై రాజ్యాంగ సూత్రబద్దంగా పాలించేందుకు ఏ అడ్డూ ఉండకూడదు. అడ్డుపడే విధంగా ఎవరు మాట్లాడినా వారు రాజ్యాంగ విరోధుల కింద లెక్క. గతంలో హత్రాస్ బాధితుల ముగింపు చరిత్రేమిటి? ఘటనను ప్రపంచానికి చాటిన పాత్రికేయులు ఏమయ్యారు? జమ్మూకాశ్మీర్ లో ఏడేళ్ళ బాలిక అసిఫా కేసు ఏమైంది? ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం కోసం వెళ్లిన యువతి జీవితం ఎలా అంతమైంది? ఆమె తండ్రి జీవితం ఎలా ముగిసింది? మధ్యప్రదేశ్ "వ్యాపం" కుంభకోణంలో దోషులేమయ్యారు, సాక్షులు ఏమయ్యారు? నిర్దోషులేమయ్యారు. ఇవన్నీ వక్రీకరించిన కథలు కావు. చరిత్రను ఎర్రని రక్తపు మరకలతో తడిపేసిన వాస్తవాలు. కాల గర్భంలో కలిసి పోయిన జీవితాలకు సంబంధించిన సజీవ సాక్ష్యాలు. బంగారు భవిష్యత్తుకోసం కలలుగన్న భారత పౌరుల నిజజీవితాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ అక్షరాలు ప్రాణం పోసుకొన్నాయి. వ్యాధి తీవ్రతకు కారణమైన వారి గురించి దునుమాడేందుకే అక్షరాలు లక్షలుగా పోగై ప్రయాణం ప్రారంభించాయి.
చేతులెత్తి మొక్కుతాం.. చేతులు కలపకండి, ఆరడగుల భౌతిక దూరం పాటించండి. మాస్కు లేకుండా బయటకు రాకండి...ఇన్ని మాటలు ఊరూ వాడా చాటిన యంత్రాంగాయానికి, పాలకులకు కరోనా రెండో విడత విలయం సృష్టిస్తుందని తెలియదా? తెలుసు. అయినా ఎన్నికలు జరపాలి. తాము నిర్ణయించుకున్న స్థాయిలో ప్రచారం సాగాలి. ప్రజలు రాలిపోతారని తెలుసు. అయినా ర్యాలీలు జరగాలి, పార్టీలు, నేతలకు అటవిడుపు కావాలి. ప్రచారం చేయాలంటే ఎన్నికల నిర్వహణా కాలాన్ని నెలలతరబడి పెంచుకొంటూపోవాలి. అలా ఓట్లు రాలాలి. ఎన్నికల నిర్వహణను ప్రహసంగా మార్చి ఓట్ల మాసోత్సవాలుగా మార్చిన చరిత్ర ఇది. ఓట్ల మారాజులను ఎన్నికల ప్రచార కార్మికులుగా మార్చి కరోనా వ్యాప్తిని ప్రోత్సహించిన ఎన్నికల కమిషన్ ను సాక్షాత్తూ మద్రాసు హై కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కించిత్ మార్పు కనిపించ లేదు. కనిపించదు కూడా...... ఎందుకంటే మే నెల రెండో తారేఖు ఓట్ల లెక్కింపు అయ్యేదాకా ఎ0దురు చచ్చినా, ప్రాణవాయువు అందక ఊపిరి వదిలేసినా, ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవించినా ఆ విషయం పట్టించుకునేవారు లేరు...లేరు... లేరు. తెలంగాణ లో రోజూ సగటున 9 వేల కేసులు బయట పడుతున్నాయి. అయినా అక్కడి పాలకులు ప్రజారోగ్యం పై ఏమాత్రం దయ చూపకపోగా రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. నిన్నమొన్నటి తిరుపతి పార్లమెంట్ స్థానంలో ఎన్నికలు నిర్వహిస్తే వేలాది ఉపాధ్యాయులు కరోన బారిన పడతారని గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఫలితంగా ఇప్పటివరకు కనీసం వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఆ వ్యాధికి గురై ప్రాణాలు వదిలారు. ఆయా కుటుంబాల సభ్యులు ఇపుడు గుండెలు బాదుకొంటున్నారు. గుండెలు పిండేసే సన్నివేశాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అధికారుల వికృత అధికారం ధిక్కరించలేని ఉపాధ్యాయులు సమీదలయ్యారు.
నేరం ఒకరిది... శిక్ష మరొకరికి.
"ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టెది మరో దారి" అనే సామెత చాలా ఏళ్ళ నుంచి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. అక్కడి అధికారి క్షేత్రస్థాయి నివేదికలు అడగరు... అధికారులు పంపరు. కరోనాకు వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు బలయ్యారు మర్రో! అని మొత్తుకొంటున్నా మీరు బడికి వెళ్ళాల్సిందేనని ప్రభుత్వం హుకుం జారీచేసింది. మరో చిత్రమేమిటంటే ఉపాధ్యాయులు కరోనతో చనిపోయిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని ఒక అధికారి తాపీగా సెలవిచ్చారు. వాస్తవానికి ప్రాధమిక పాఠశాలలతో పాటుగా మాధ్యమిక, ఉన్నత పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే పద్దతి ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం ఆ విశయంలో ఎందుకో మీనమేషాలు లెక్కింపుకు పూనుకొంది. అయితే విద్యార్థుల పక్షాన తాము గోడవచేసి సెలవులు ప్రకటింప చేసామనే కీర్తి కిరీటాన్ని తగిలించుకోవడానికో, ప్రజల మీద ప్రేమో తెలియదుగానీ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి అలిమేటం ఇచ్చి పుండు మీద కారం చల్లాయి. ఇపుడు ప్రభుత్వం బడి పెట్టాల్సిందే... పది పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ మోడీ వేసుకు కూచుంది. మరో వైపు వ్యాధితో ఉపాధ్యాయులు పిట్టల్లా రాలిపోతున్నారు.
ఈ దశలో ప్రభుత్వం వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని ప్రయివేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకొని ప్రజలకు, ఉపాధ్యాయులు మెరుగైన వైద్య వసతులు కల్పించి ప్రాణాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కోరుతోంది. తక్షణమే పాఠశాలలకు సెలవులు ప్రకటించి, ఉపాధ్యాయుల, విద్యార్థుల జీవితాలకు ఊరట కల్పించాలని కోరుతోంది.