పులి మీద పుట్ర
ఉపాధ్యాయుల ప్రాణాలు తీసే ఆహ్వానాలు
(ఏపీటీఎఫ్ 1938)
డి ఈ ఓ కార్యాలయం/ స్పెషల్ /ఇ2/2021 తేదీ 28.04.2021, నెల్లూరు
విద్యాశాఖ వెకేషన్ శాఖ. ఒకసారి వేసవి సెలవులు ప్రకటిస్తే వారు స్వేచ్చాజీవులు. విద్యారంగానికి సంబంధించి, స్పాట్, ఇన్విజిలేషన్ తో పాటు రాజ్యాంగ ఫరిధిలో సెన్సస్ విధులు, ఎన్నికల నిర్వహణ విధులు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సమయంలో (ఐచ్చికం) ఉపాధ్యాయుల సెలవులను కుదించి వారి సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పటికే మారిన విద్యారంగ గమనం, ప్రభుత్వ అవసరాలు, పథకాలు, అదుపుతప్పిన కంప్యూటర్ పరిజ్ఞానం వెరసి ఉపాధ్యాయుల జీవితాల్లో కుంపటి రాజేశాయి. క్షణం తీరిక లేక సకల రోగాలు చుట్టుముట్టి రోగ గ్రస్థులయ్యారు. నిన్నమొన్నటి ఎన్నికల విధులు, గత ఏడాది కరోనకు ముందునుంచి నడుస్తున్న నాడు-నేడు పనులు ఉపాధ్యాయుల జీవితాలకు రక్షణ లేకుండా చేశాయి. తిరుపతి ఉప ఎన్నికల అనంతరం కరోనా కాటుకు గురై వందల సంఖ్యలో ఉపాధ్యాయులు జీవితాలు చితిమంటల్లో తగలబడిపోయాయి. మరెందరో ఆస్పత్రుల్లో అయినవారి కడసారి చూపులకు దూరమై ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇంకెందరో విధి బాధితులమని నిందించుకొంటూ ఇళ్లలోనే మందులు మింగుతూ ప్రాణాలు నిలుపుకునేందుకు విఫల యత్నం చేస్తున్నారు.
ఇది నడుస్తున్న చరిత్ర.
రేపేంటో కనుచూపు మేర కనిపించని అగమ్యగోచరంగా ఉంది
ఇప్పటికే స్మశానాలు చేరిన చావుల సంఖ్య అధికారులను సంతృప్తి పరిచినట్లు లేదు. యేడాది కాలంగా చదువుల చాకిరీకి పాస్ మార్కులు దక్కినట్లు లేదు. నిన్న గాక మొన్న వేసవి సెలవులు ప్రకటించారో లేదో ఆఘమేఘాల మీద ఈ సాయంత్రం ఉపాధ్యాయులను కోవిడ్ విధుల్లో నియమించి వైద్య ఆరోగ్య శాఖకు లొంగదీశారు. (అదే ఎండార్స్ చేశారు). రేపటి నుంచే కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫ్రంట్ లైన్ సైనికులుగా నిలిపి వారి సేవలను వినియోగించుకునేందుకు జిల్లా విద్యాశాఖాధికారి ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఇది ప్రస్తుతానికి నెల్లూరులో ప్రారంభమైనప్పటికీ మిగిలిన ప్రాంతాలకు వర్తింపజేసే ప్రమాదం పొంచివుంది. ఉపాధ్యాయులకు కనీస రక్షణ పరికరాలు లేకుండా అప్పణంగా కరోనాకు అప్పగించే యత్నాలను తిప్పికొట్టే యోచన చేస్తున్నాం. మనమేమీ యుద్ధ విద్యలో అతితేరిన నిపుణులం కాదు. జీవితం అంటే రెండున్నర గంట సినిమా కాదు. ఇది జీవితం. మనకు జీతం ముఖ్యమే!. కానీ...జీవితం అంత కంటే ముఖ్యం!! ఈలోపు ఉపాధ్యాయులు అధికారుల హుకుంకు జడిసి సాష్టాంగ ప్రణామాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. విధి శాపానికి గురై మూల్యం చెల్లించుకోవద్దు. ఉద్యోగం పోతే వీధుల్లో ఉప్పు అమ్ముకొని బ్రతకొచ్చు. అదీ కాకపోతే జోలీ పట్టి యాచించి కుటుంబానికి నాలుగు మెతుకులు పెట్టుకోవచ్చు. ప్రాణం పోతే మీ కుటుంబం పరిస్థితి ఏమిటి.? ఫ్యాప్టో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లివుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనేందుకు సంఘాలున్నాయి. ఏపీటీఎఫ్ మీ పక్షాన పోరాటంలో ముందుంటుంది. ఈ విషయంలో ఐక్యతను చాటండి. . సోదర, సోదరీమణులారా బహు పరాక్
-మోహన్ దాస్, ఏపీటీఎఫ్ 1938.