డిగ్రీ ఉత్తీర్ణులూ పీహెచ్డీలో చేరొచ్చు📚✍️
♦️8 సెమిస్టర్ల కోర్సులో 75 శాతం మార్కులు రావాలి
♦️పీజీలో తొలి ఏడాది పూర్తి చేసినవారూ అర్హులే
♦️యూజీసీ కొత్త నిబంధనల జారీ
: పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలు జారీచేసింది. దీని ప్రకారం 4 ఏళ్లు/8సెమిస్టర్ల బ్యాచ్‌లర్ డిగ్రీ కోర్సుల్లో 75 శాతం మార్కులతో పాస్ అయిన విద్యార్థులూ ఇకమీదట పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నాలుగేళ్ల డిగ్రీ తర్వాత మాస్టర్స్ డిగ్రీ(పీజీ) మొదటి సంవత్సరంలో 2 సెమిస్టర్లు పూర్తిచేసినవారు, మూడేళ్ల డిగ్రీ తర్వాత పీజీ కోర్సులో 2ఏళ్లు/4 సెమిస్టర్లు పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి వారికి కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. 55 శాతం మార్కులతో ఎంఫిల్ పూర్తిచేసిన వారూ పీహెచ్‌డీలో చేరడానికి అర్హులే. ఈ అన్ని విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌క్రిమీలేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి మార్కుల్లో 5 శాతం మినహాయింపు ఉంటుంది. ఇకమీదట పీహెచ్‌డీ కాలపరిమితి కనీసం మూడేళ్లు, గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది. రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా గరిష్ఠంగా 2 ఏళ్ల అదనపు సమయం ఇస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీహెచ్‌డీ పూర్తికి 8 ఏళ్ల పరిమితి మించకూడదు. మహిళలు, దివ్యాంగుల (40శాతానికి మించి వైకల్యం ఉన్నవారు)కు మరో 2 ఏళ్ల పరిమితి ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఇలాంటివారు పీహెచ్‌డీలో చేరిన నాటి నుంచి పదేళ్లలో దాన్ని పూర్తిచేయడానికి వీలుంటుంది. మహిళా అభ్యర్థులు పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో 240 రోజులపాటు ప్రసూతి, శిశుపాలన సెలవులు తీసుకోవచ్చు.
▪️ యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్, గేట్, సీడ్ లాంటి జాతీయస్థాయి ప్రవేశపరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను పీహెచ్‌డీలో చేర్చుకోవచ్చు. లేదంటే ఉన్నత విద్యాసంస్థలు తాము సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించి కూడా ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే ఆ పరీక్ష 50 శాతం రీసెర్చ్‌మెథడాలజీ, 50శాతం సంబంధిత సబ్జెక్టు ఆధారంగా ఉండాలి. ఈ ప్రవేశ పరీక్షల్లో 50శాతం మార్కులు సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూలకు పిలవొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది. అందుబాటులో ఉన్న పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను బట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచే స్వేచ్ఛ ఉన్నత విద్యాసంస్థలకు ఉంటుంది. ఆ సంస్థలు నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఉంటే ప్రవేశపరీక్షలో సాధించిన మార్కులకు 70శాతం, ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభకు 30శాతం వెయిటేజీ ఇవ్వాల్సి ఉంటుంది.