రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 3 విడతల డి.ఎ.లను నిలుపుదల చేస్తూ ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, కె.వెంకటేశ్వర రావు ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ సంక్షేమ పథకం వాయిదా వేయకుండా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన డి.ఎ.లు, జీతాలు, పీఆర్సీ అమలును మాత్రం వాయిదా వేయడం సబబు కాదన్నారు. కోవిడ్ -19 పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రారంభించిన తదుపరి నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కోవిడ్ బారిన పడినవారు చికిత్సల కోసం, మందుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కోవిడ్ జాగ్రత్త కోసం అదనంగా ఖర్చు అవుతోందన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా ఇవ్వాల్సిన డి.ఎ లను మంజూరు చేయాలన్నారు.
అధికారంలోకి వస్తే ఉద్యోగులకు రావలసినవన్నీ కూడా సమయానికి వచ్చేటట్లుగా, ప్రతి డి.ఎ, సమయానికి వచ్చేటట్లుగా చేస్తానని, ఉద్యోగుల సంక్షేమం నవరత్నాలో ఒక రత్నం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కూడా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలు విడనాడి, చెల్లించాల్సిన అన్ని ప్రయోజనాలను వాయిదా వేయకుండా అమలు చేయాలన్నారు.లేని పక్షంలో త్వరలో ఏపి జెఎసిలోని అన్ని సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని APTF నేతలు తెలిపారు.
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు,APTF:1938