*APTF INFO:*
నేడు సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , CMO ధనుంజయ్ రెడ్డి , ఐఏఎస్ అధికారులు గురువారం సుదీర్ఘంగా అన్ని సమస్యలపై చర్చించడం జరిగింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి తగు పరిష్కారాలు చేస్తామని అన్నారు. APTF పక్షాన రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు విద్యారంగ - ఉపాధ్యాయుల సమస్యలు వివరించి విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నవి ముఖ్యమంత్రి దృష్టికి...
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్
రాష్ర్టంలో ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక అంశాలతో సంబంధం లేని సమస్యలన్నింటినీ నాలుగైదు రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం తరపున రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రకటించారు. ఆర్థిక సంబంధమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మహిళా ఉద్యోగినులకు 5 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేస్తామని చెప్పారు. ఆర్థికేతర అంశాలు ఏయే శాఖాధికారికి సంబంధం ఉందో వారితో మాట్లాడి నాలుగైదు రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై మరో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
సచివాలయంలో గురువారం రాత్రి జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశం రాత్రి 9.30 గంటలకు ముగిసింది. తొలుత సర్వీసులశాఖ సెక్రటరీ శశిభూషణ్ సంఘాల ప్రతినిధులందరినీ పరిచయం చేశారు. తర్వాత ఆయా సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లు విన్నవించారు. పీఆర్సీ, సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అన్న అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అవి కాకుండా మిగిలిన సమస్యలను ప్రస్తావించాలని ప్రభుత్వ ప్రతినిధులు సూచించారు. తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. ఆనక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వరుసగా మాట్లాడారు . చివర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం ఇచ్చారు.