ఎదురుచూపులు
ఎన్నాళ్లు?
Mar 30 2021 @ 03:07AM
- టీచర్ల రిటైర్మెంట్ ప్రయోజనాల్లో తీవ్ర జాప్యం
- పదవీ విరమణ తరువాత అవే ఆసరా
- 400 మందికి అందని గ్రాట్యుటీ, కమ్యుటేషన్
- గతంలో రిటైర్ అయిన నెలలోనే ఆమోదం
- నేడు శాపంగా మారిన ఆర్థిక అరాచకం
- రాబడి, పన్నుల ఆదాయానికి మించి ఖర్చు..
- దీంతో టీచర్ల బిల్లులకు దొరకని మోక్షం
- బదిలీ అయిన 6 వేలమందికి జీతాలు బంద్
- మూడు నెలలుగా కొర్రీలేస్తున్న ఆర్థికశాఖ
- 2 వేల మంది టీచర్లకు 8 నెలలుగా ఆగిన పీఎఫ్
⭕నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన టీచర్ రమణారావు గత డిసెంబర్‌లో రిటైరయ్యారు. గ్రాట్యుటీగా రావాల్సిన రూ.12 లక్షలు ఇప్పటి వరకు ఆయనకు అందలేదు.
⭕ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన వేలాదిమంది టీచర్లకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోయాయి. పదవీవిరమణకు మూడునెలల ముందు నుంచే టీచర్లు బిల్లులు సమర్పిస్తుంటారు. పదవీవిరమణానంతర జీవితానికి పీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌లే ఆలంబన. అందువల్ల సాధారణంగా వాటిని ఆపరు. రిటైర్ అయిన నెలలోనే విడుదల చేస్తారు. అలాంటిది ఇప్పుడు రిటైరయిన ఏడెనిమిది నెలల తరువాత కూడా బిల్లులు క్లియర్ కావడం లేదు. చివరకు బదిలీ అయి వెళ్లిన కొత్తచోట వెంటనే వేతనాలు విడుదల చేయకుండా ఆర్థికశాఖలోని సీఎ్‌ఫఎంఎస్ విభాగం కొర్రీలు వేస్తోంది. శాఖల మధ్య సమన్వయలోపం ఈ సమస్యకు మరింత ఆజ్యం పోస్తోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
🌻(అమరావతి - ఆంధ్రజ్యోతి)
సర్వీసులో ఉన్నంతకాలమూ పీఆర్‌సీ, డీఏల కోసం ఎదురుచూపులే! పదవీవిరమణ తర్వాతైనా కాస్తంత ఊరట దొరుకుతుందని చూస్తే, అంతకుమించిన ఆర్థిక సమస్యలు టీచర్లను వెంటాడుతున్నాయి. పైగా, తమ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉన్నదని ఇటీవల రిటైర్ అయిన పలువురు టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ రాబడిని విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తానికి జవాబుదారీ తనం లేకపోవడమే ఈ అసాధారణ పరిస్థితిని తెచ్చిపెట్టిందని చెబుతున్నారు.
🌻గత ప్రభుత్వాల హయాంలో ఏ ఉద్యోగి అయినా రిటైరైతే అదే నెలలో పదవీ విరమణ ప్రయోజనాలను అందుకొనేవారు. ముందస్తు బిల్లులకు చెల్లింపులు జరగటంతో ఆ మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా, ప్రాధాన్యాలమేరకు వినియోగించుకునేందుకు వీలుకలిగేది. కానీ ప్రస్తుత ప్రభు త్వం పాత పద్ధతులు, విధానాలకు పాతరేసింది. పదవీ విరమణ చేసే ఉపాధ్యాయులు, ఉద్యోగుల విషయంలో పూర్తిగా శీతకన్ను వేస్తోంది. రిటైర్మెంట్ టీచర్ల అవసరాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
🌻ఒక్కో ఉపాధ్యాయునికి రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే కనీసం రూ.5లక్షల నుంచి రూ.ఎనిమిది లక్షలు వరకు ప్రావిడెంట్ ఫండ్ అందాలి. సగటున ఒక్కో టీచర్‌కు గ్రాట్యుటీ కింద రూ.12లక్షలు, కమ్యుటేషన్ కింద రూ.13 లక్షలు.. మొత్తం కలిపి రూ.25 లక్షల వరకు చెల్లించాలి.
🌻వాస్తవానికి రిటైర్మెంట్‌కు మూడు నెలల ముందునుంచే టీచర్లు తమకు రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులన్నీ క్లెయిమ్ చేసుకుంటారు. అన్ని లాంఛనాలు పూర్తిచేసుకుని రిటైర్మెంట్ కాగానే ఆయా ప్రయోజనాలను వారి ఖాతాకు జమ కావాలి. కానీ ఈ బిల్లులన్నింటినీ నిలిపివేశారు. గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు 2వేల మంది రిటైర్డ్ టీచర్లకు పి.ఎఫ్. నిలిచిపోయింది. సుమారు 400 మంది టీచర్లకు ఈఏడాది జనవరి నుంచి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ కింది అందాల్సిన డబ్బులు చేతికి రాలేదు. ఆర్థికశాఖలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ విభాగం (సీఎ్‌ఫఎంఎస్) కొన్ని నెలలుగా టీచర్లు సమర్పించిన బిల్లులు క్లియర్ రావడం లేదు. రిటైర్మెంట్ ఉపాధ్యాయుల ఏపీజీఎల్‌ఐ బిల్లులు కూడా గత ఏడాది ఆగస్టు నుంచి నిలిచిపోయాయి. ఒక్కో టీచర్‌కు ఈ బిల్లు కింద దాదాపు రూ.10 లక్షల వరకు అందజేయాల్సి ఉంది. ఫిబ్రవరి నెల పెన్షన్లనుంచి పెన్షనర్లకు భారీగా కోత విధించారు. కారణం ఆదాయపు పన్ను అని చెబుతున్నా.. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారికి కూడా భారీగా కోత విధించినట్లు తెలుస్తోంది. పెన్షనర్లకు చెల్లిస్తామన్న రెండు నెలల డీఏ బకాయిలు కూడా ఇంతవరకు జమ కాలేదు.
♦బదిలీ అయ్యారు.. జీతాలు బంద్
సీఎ్‌ఫఎంఎస్, ట్రెజరీ, పాఠశాల విద్యాశాఖ మధ్య సమన్వయలోపం వల్ల దాదాపు 6వేల మంది టీచర్లకు జనవరి నుంచి జీతాలు నిలిచిపోయాయి. విద్యాశాఖ నిర్వహించిన రేషనలైజేషన్, బదిలీ కారణంగా వీరంతా జనవరి 16న కొత్త స్కూళ్లలో చేరారు. అప్పటి నుంచి వారికి జీతాలు రావడం లేదు. వీరికి గతంలో పనిచేసిన పాఠశాలలో జీతం నిలిపివేయగా, కొత్త పాఠశాలలోనూ అదే పరిస్థితి. పాఠశాల విద్యా కమిషనర్ నుంచి వివరాలు వస్తేనే చెల్లిస్తామని తొలుత సీఎఫ్‌ఎంఎస్ మెలికపెట్టింది.
🌻రేషనలైజేషన్, బదిలీలద్వారా స్కూళ్లు మారిన ఉపాధ్యాయుల వివరాలు పాఠశాల విద్యా కమిషన్ పంపింది. అయితే, మొత్తం సిబ్బంది వివరాలు కావాలని సీఎ్‌ఫఎంఎస్ మరో కొర్రీ వేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు వినతిపత్రాలు ఇవ్వడంతో... ట్రెజరీ ద్వారా వివరాలు సమర్పిస్తే చాలని వెసులుబాటు ఇచ్చింది. కొత్తగా చేరిన టీచర్ల వివరాలను డీడీవోలైన ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్ల వివరాలను ఎంఈవోలు ఆన్‌లైన్‌లో ట్రెజరీకి సమర్పించినా .. అక్కడి నుంచి సిఎ్‌ఫఎంఎస్ కి చేరాయి. కానీ సదరు ఆరువేలమంది టీచర్లకు జీతాలు మాత్రం ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం.
🌻కృష్ణా జిల్లా గొల్లపూడి లోని ఎయిడెడ్ స్కూల్‌లో పనిచేస్తున్న ఓ టీచర్ జనవరిలో పదవీ విరమణ చేశారు. కమ్యుటేషన్ కింద రావాల్సిన రూ.13 లక్షలు , గ్రాట్యుటీ కింద అందాల్సిన రూ.12 లక్షలు ఇప్పటికీ ఆయన ఖాతాలో పడలేదు.
‘‘ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల విడుదలపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం గర్హనీయం. ఆర్థికశాఖ అరాచకత్వాన్ని విడనాడి, టీచర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలి’’
💥కె.వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ