- - సత్ఫలితాల సాధనకు పోరాటమే మార్గం
- - సీపీయస్ రద్దు ప్రభుత్వ బాధ్యత
- - పీయార్సీ కోసం అశుతోష్ మిశ్రా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి*
- - తాత్కాలిక వాయిదా ఉద్యమ ఎత్తుగడలో భాగమే
- - ఏపీటీయఫ్ శ్రీకాకుళం జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో నాయకుల ప్రసంగం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల కోర్కెలు సంపూర్ణంగా పరిష్కారం కావాలంటే ఉద్యమం తప్ప మరో మార్గం లేదని, సత్ఫలితాలను సాధించుకోవాలంటే పోరాటమే మార్గమని ఏపీటీయఫ్ సీనియర్ నాయకులు సన్నశెట్టి రాజశేఖర్, ఏపీటీయఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్ కుమార్ అన్నారు. ఈరోజు శ్రీకాకుళం పాత బస్టాండ్ దరిలో గజపతి హోటల్ లో నిర్వహించిన ఏపీటీయఫ్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో జెఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా కొనసాగుతున్న పోరాటానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని కోరారు. పీయార్సీ కోసం అశుతోష్ మిశ్రా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలనీ, దశలవారీగా సాగుతున్న ప్రస్తుత ఉమ్మడి ప్రత్యక్ష కార్యాచరణతో కూడిన ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేయడం ఉద్యమ ఎత్తుగడలో భాగమేనని వారన్నారు. 55 శాతం ఫిట్మెంట్ తో కూడిన పీయార్సీ, సీపీయస్ రద్దు వంటి మొత్తం 71డిమాండ్లకు సీయం సమక్షంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఈ సమావేశానికి ఏపీటీయఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వాన కామేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఏపీటీయఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్ కుమార్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.సుమలత సందేశం ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి టి.చలపతిరావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లా సహాధ్యక్షులు బల్లెడ రవి, అదనపు కార్యదర్శి పొన్నాడ బాలాజీ రావు, ఉపాధ్యక్షులు మామిడి భుజంగరావు, బుక్కూరు వెంకటేశ్వర్లు, బలగ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు వైవీ రమణ, టి.శివరావు, వై శేషగిరిరావు తదితర నాయకులు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.