ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98మంది లోపు విద్యార్థులు ఉంటే ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్లనే కేటాయించారు. దీంతో స్కూల్ అసిస్టెంట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉన్నత పాఠశాలల్లో 3-10 వరకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తుండగా.. ప్రాథమికోన్నత బడుల్లో మాత్రం 3-8 ఎస్జీటీలతో చేయించనున్నారు. 3-10 వరకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తగ్గిందని విధానాన్ని మార్చేస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉన్న చోట పిల్లలకు ఒక న్యాయం, ఎక్కువ మంది ఉన్న చోట మరో న్యాయం ఏంటి? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విధానంలో హేతుబద్ధీకరణ చేయడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేలాయి. 98లోపు విద్యార్థులున్నచోట 30మందికి ఒక్క ఎస్జీటీని కేటాయించారు. ఈలెక్కన 3-7/8 తరగతులు ఉన్న చోట నలుగురు ఎస్జీటీలు ఎలా బోధన చేస్తారు. ఉపాధ్యాయ పోస్టులను మిగుల్చుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని పాటిస్తోందని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.