APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF » కరోనాతో దీర్ఘకాలిక పోరాటానికి మనం సిద్ధం కావాలి ::యు.సురేంద్ర , ఎ. పి.టి.యఫ్.

కరోనాతో దీర్ఘకాలిక పోరాటానికి మనం సిద్ధం కావాలి ::యు.సురేంద్ర , ఎ. పి.టి.యఫ్.

Posted by APTF 1938
» APTF
» Wednesday, 29 April 2020


మిత్రులారా ,
మనం ఊహించని, కలలో కూడా అనుకోని  అనూహ్య పరిణామాలు మార్చి, ఏప్రిల్ నెలల్లో మన మీద అమాంతంగా వచ్చి పడిపోయాయి. గతంలో ఎన్నడూ ఎదుర్కో నటువంటి, కంటికి కనిపించని విపత్తు తో లేదా శత్రువుతో మనం పోరాడుతున్నాం.ఈ సందర్భంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమకు చేతనైనంత మేర  సమాజంలోని అట్టడుగు వర్గాల  ప్రజలను ఆదుకునేందుకు చేసిన ప్రయత్నం ఎంతో అభినందనీయం.జిల్లావ్యాప్తంగా ఏపిటిఎఫ్ శ్రేణులు కూడా ఈ బృహత్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా గొప్ప విషయం. గతంలో కూడా ఏపీటీఎఫ్ ఇలాంటి విపత్తుల సమయంలో పేద ప్రజలకు అండగా నిలబడడం మనకు తెలిసిందే. కోవిడ్ -19 సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపిటిఎఫ్ శ్రేణులకు ,ఆర్థిక సహాయం చేసిన గొప్ప మనసున్న దాతలకు  పేరుపేరునా ధన్యవాదాలు.
     కరోనా వైరస్ మానవ జాతి మీద చేసిన దాడి ఎంతో బాధాకరం. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చాలా అంశాలు చరిత్రలో ఎప్పుడూ వివాదాస్పదం గానే మిగిలిపోయాయి. వీటిలోని నిజానిజాలు తప్పు ఒప్పులు పూర్తిగా బయటకు రావడం లేదు. కరోనా  వైరస్ పుట్టుక చైనా దేశంలోని "ఊహన్" నగరంలోని జరిగినట్లు చెప్పబడుతున్నది. వైరస్ పుట్టుక సహజంగా జరిగిందా? లేక మానవ తప్పిదమా?  లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనే విషయం తేటతెల్లం కావడం లేదు. ప్రపంచ దేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు (జపనీస్ శాస్త్రవేత్తలు కూడా) ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ అన్ని  ఉష్ణోగ్రతలలో అన్ని వాతావరణ పరిస్థితులలో మనిషి నుంచి మనిషికి అత్యంత సులభంగా సంక్రమించ  గల  మేలు లక్షణాలు గల వైరస్ అని చెబుతున్నారు. ఇలాంటి వైరస్ లు  జంతువుల నుండి మనుషులకు అంత సులభంగా సంక్రమించవు. ఒకవేళ సంక్రమించినా ఇంత వేగంగా ప్రపంచమంతా విస్తరించే అవకాశం లేదని వాపోతున్నారు. ప్రపంచ దేశాల్లోని అనేకమంది మేధావులు ఈ వైరస్ పుట్టుకపై నిష్పక్షపాత సమగ్ర విచారణ జరిపించాలని చైనా ను  కోరుతూ ఉన్నారు. కానీ చైనా దేశ ప్రభుత్వం అటువంటి విచారణ జరిపిస్తుందో లేదో ! దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
           
           ఏది ఏమైనా ప్రపంచంలోని మానవ జాతి కరోనా  కుదుపు తో తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయింది. అయినప్పటికీ మనదేశంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే కరోనా  వల్ల ప్రాణాపాయం చాలా  తక్కువగానే ఉంద నేది  నూటికి నూరు శాతం నిజం.లాక్ డౌన్  వల్లనైతేనేమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల నైతేనేమి వ్యాధి సోకిన వారి సంఖ్య కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో తక్కువగానే ఉంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ,అధికారులు వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు ఈ  సందర్భంగా చేస్తున్న కృషి అభినందనీయం.అధికారుల, వైద్యుల, పోలీసుల,పారి శుద్ధ కార్మికుల ఆత్మ స్థైర్యాన్ని పెంచే  విధంగా ప్రతి భారతీయ పౌరుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన మరియు వ్యవహరించవలసిన అత్యవసర సమయం ఇది అని మనం అందరం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.
      ఇంట్లో ఎవరైనా మరణించి ఎత్తుబడి పూర్తై  ఇల్లు కడిగి శుభ్రం చేసిన తరువాత  ఆ  ఇంటి ఆడపడుచు తన ఇంటి నుంచి లేదా తన వసతిని బట్టి హోటల్ నుంచి  మరణించిన వ్యక్తి  ఇంటిలో గల పిల్లలకు పెద్దలకు ఆహారం తెచ్చి పెట్టడం మనం చూస్తాం. ఇది గమనించండి మన పూర్వీకులు ఎంత ఆలోచన తో ఏర్పాటుచేసిన ఆచారం ఇది.దీని అర్థం "మరణం"తో ఈ ప్రపంచం ఆగిపోదు మరలా జీవన స్రవంతిని కొనసాగించాలి జీవితం మీద ఆశ కలిగి ఉండాలి అని మనకు తెలియ జప్తుంది . కరోనా గురించి  ఎక్కువ భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదు. కరోనా వ్యాధి కేవలం 65 సంవత్సరాలు పైబడిన వారిని, అనేక అనారోగ్య సమస్యలు కలిగిన వారినే ఎక్కువగా బాధిస్తుంది.వాస్తవ దృష్టితో ఆలోచిస్తే పదిరోజుల్లో నో లేక ఇరవై  రోజుల్లోనే మంత్రం వేసినట్లు దేశం నుంచి కరోనా  వ్యాధి మాయం కాదు. కనుక మనలో ప్రతి ఒక్కరూ మన అలవాట్లను జీవన విధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడే కాకుండా రాబోయే కొన్ని  రోజుల్లో కూడా మనం  క్రింది  పనులను తూచా  తప్పకుండా పాటించాలి.


  1. ఇంటి  నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి. మాస్కు లేకపోతే చేతి గుడ్డను అయినా మాస్క్  గా కట్టుకోవడం  చాలా మంచిది.
  2. అవసరమైతేనే ప్రభుత్వం సూచించిన సమయంలో బయటకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలి.
  3. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం.వీధి లోపలి ప్రాంతాలలో  గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లా డు  కోవడం, భుజాలమీద చేతులు వేసుకుని తిరగడం లాంటి పనులు ఇప్పటికీ కొందరు యువకులు చేస్తున్నారు. తక్షణం ఈ పనులు మానాలి.
  4. షాపులలో, రైతు బజార్లలో సామాజిక దూరం పాటించాలి. షాపు యజమానులు తమ కస్టమర్లను సామాజిక దూరం పాటించే టట్లు చేయాలి. సామాజిక దూరం పాటించని షాపులకు మనం వెళ్ళకూడదు.
  5. తమ ఇళ్ళకు దగ్గరలోని  వీధి లోపలి  ప్రదేశాలు ,పోలీసులు రానటువంటి ప్రదేశాలలో షటిల్, పేకాట, దాయాలు, పులి-మేక వంటి ఆటలు  ఆడడం , గుంపులుగా కూర్చొని పొద్దు పోని  మాటలు మాట్లాడుతూ కూర్చోవడం ఎంతో ప్రమాదకరం. ఇటువంటి వారి వల్లే వ్యాధి మరింతగా వ్యాపించే ప్రమాదం ఉంది.
  6. అత్యవసర పనులపై లేదా విధి నిర్వహణ పై బయటకు వెళ్ళినప్పుడు  శానిటైజర్ ను  అందుబాటులో ఉంచుకోవాలి
  7. ఇంటిలోకి తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. విడిచిన బట్టలను  వేడినీళ్లలో లేదా Dettol నీళ్లలో ఉంచాలి. ఇంటిలో కి వెళ్ళి శుభ్రంగా స్నానం చేయాలి.
  8. కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఎక్కువ నీటితో కడగాలి. తదుపరి ఉప్పు నీటితో కడగాలి ఇంటి బయటే కొద్ది సమయం ఎండలో వీటిని ఆరబెట్టి తరువాత ఇంటి లోనికి తీసుకు వెళ్ళాలి.
  9. కార్యాలయాలలో, షాపులలో టాయిలెట్లు, వాష్ రూమ్ లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ఇక్కడ  నీళ్లు (water) అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ ,సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం వంటివి  అందుబాటులో వుంచుకోవాలి. హ్యాండ్ వాష్ కొరకు సబ్బులను అందుబాటులో ఉంచుకోవాలి.
  10. చాలామంది కళ్ళు నలుపు కోవడం,  వేళ్ళు ముక్కులో  పెట్టుకోవడం, నోటిలో వేలు పెట్టుకోవడం వంటి పనులను  తరచూ చేస్తూ ఉంటారు .ఇది మానడం  ఎంతో అవసరం. దీనికొరకు మనం ఇంట్లో ఉన్నప్పుడే  ఈ అలవాట్ల నుంచి బయట పడేందుకు చేతులు ముఖం మీద పెట్టకుండా ప్రాక్టీస్ చేయాలి.నియంత్రణ చేసుకోవాలి.
  11. ఆహార పదార్థాలను వృధాగా పడేయడం మానాలి. ఆహార వనరులను  పొదుపుగా వాడుకోవాలి .పౌష్టికాహారం తీసుకోవాలి. ఇంటిలో వండిన ఆహారాన్ని తీసుకోవటం అత్యుత్తమం. ఆఫీసులకు వెళ్లేవారు సైతం ఇంటిలో తయారుచేసిన ఆహారాన్ని బాక్స్ లలో తీసుకు  వెళ్లడం చాలా మంచిది.తప్పనిసరై హోటల్లో కానీ బయట కానీ తినాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి."లంగ్స్ కెపాసిటీ" పెంచుకునే విధంగా వ్యాయామం , "యోగా" చేయాలి. మానసిక ఉల్లాసం కొరకు పుస్తకాలు చదవాలి. హాస్యభరితమైన చిత్రాలను చూడడం మంచిది. నిరంతరం కరోనా  వార్తలు చూడడం కరోనా  వార్తలను భయానకంగా చూపించే ఛానల్స్ ను చూడడం మంచిది కాదు.  అవే చూస్తుంటే మానసిక ఆందోళన పెరుగుతుంది. రోజుకు ఎనిమిది గంటల సమయం ప్రశాంతంగా నిద్ర  పోవాలి.
  12. వ్యక్తులను, కుటుంబ సభ్యులను, స్నేహితులను నేరుగా వెళ్లి పరామర్శించడం కన్నా  ఫోన్ ద్వారా పరామర్శించడం ఉత్తమం.స్వల్ప అనారోగ్య సమస్య లకు  telemedicine లేదా ప్రభుత్వం చెప్పిన ఇతర సదుపాయాలను ఉపయోగించుకుని వైద్య సహాయం పొందడం ఉత్తమం. చీటికిమాటికి ఆస్పత్రులకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు. ఎమర్జెన్సీ అవసరాలకు మంచి ఆసుపత్రులను మాత్రమే ఎన్నుకోవాలి
  13. తరచూ గోరు వెచ్చని నీళ్లు తాగడం, చేతులు సబ్బుతో కడుక్కోవాలి. కొద్దిపాటి జలుబు ,దగ్గు ఉంటే ఉప్పు, పసుపు పొడి కలిపిన నీళ్ళు తరచూ పుక్కిలించాలి. వేడి నీటిలో తులసి, పసుపు పొడి,వేపాకు వేసుకుని ఆవిరి పట్టించడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.ఇంటిలో తయారు చేసిన గ్రీన్ టీ ,లెమన్ టీ తులసి ఆకు తో చేసిన టీ ,అల్లంటీ ,    అల్లం,మిరియాల కషాయం ( వీటన్నిటి లో ఏదోఒకటి)  వంటివి రోజుకు ఒకసారి లేదా రెండు మూడు రోజులకు ఒకసారైనా తీసుకోవడం చాలా మంచిది. పెంపుడు జంతువులకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.
  14. .పసిబిడ్డలను ,వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబాలలో అందరూ ఐకమత్యంగా ఉండాలి .ఒకరి పట్ల ఒకరు సానుభూతితో వ్యవహరించాలి. ప్రేమాభిమానాలతో మెలగాలి. "గృహ హింసకు తావు ఇవ్వకూడదు."
  15. ఒకవైపు కరోనా వైరస్ తో పోరాటం చేస్తూ మరోవైపు మనం చేయవలసిన పనులు బాధ్యతలు విధులు నిర్వహించవలసి అవసరం ఎంతో ఉంది. ఈ విధమైన జీవనానికి కావలసిన జాగ్రత్తలను వైద్యులు మేధావులు విద్యావంతులు ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

       అనూహ్యంగా కరోనా వైరస్ మానవజాతి మీద దాడి చేసింది .కానీ అది కేవలం ఒక వైరస్. మనం మానవులం. వైరస్ కన్నా  మానవుడే గొప్పవాడని గతంలో మన పూర్వీకులు నిరూపించారు. ఇప్పుడు కూడా  అదే జరుగుతోంది. మానవ జాతి మొత్తం కరోనా వైరస్ తో   పోరాడడానికి  సన్నద్ధమై నిలబడింది. సాధారణ టైలర్లు సైతం మాస్కులను  కుడుతున్నారు .ఉచితంగా కూడా పంచుతున్నారు.(Minal Dakhave Bhosale) గర్భవతిగా ఉన్న ఒక భారతీయ మహిళ COVID-19  వ్యాధి నిర్ధారణ కిట్లను(patho detect kits) తయారుచేసింది. కార్ల కంపెనీలు ఆక్సిజన్ వెంటిలేటర్ల తయారీలో తలమునకలుగా ఉన్నాయి. రాష్ట్రాలు తమ సొంతంగా పి పి. ఇ. కిట్స్  తయారు చేసుకుంటూ ఉన్నాయి.అనేక మంది మహిళా డాక్టర్లు, నర్సులు తమ కుటుంబాలను విడిచిపెట్టి  COVID-19 పేషెంట్లకు  వైద్యం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆసుపత్రులను వీధులను శుభ్రం చేస్తూ అనునిత్యం శానిటేషన్ చేస్తున్నారు.COVID-19  వ్యాధి ని నియంత్రించేందుకు అనేక కంపెనీలు మందును కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.ఎందరో శాస్త్రవేత్తలు COVID-19  నివారించేందుకు వ్యాక్సిన్ తయారీ  కొరకు ప్రయోగాలు చేస్తున్నారు. ఎందరో  ధైర్యవంతులు ఆ వ్యాక్సిన్ల ను  త మ మీద ప్రయోగించేందుకు వందల సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.ఈ ప్రయత్నం లో  తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ చిరునవ్వు చిందిస్తున్నారు.  ప్రభుత్వాలు కొత్తగా ఆసుపత్రుల సంఖ్యను పెంచుతున్నాయి అదేవిధంగా కొత్తగా వైద్యుల ను కూడా నియమిస్తూ వున్నాయి. వైరస్ ల  మీద ఎప్పుడూ మానవజాతి దే  విజయం అనేందుకు  ఇదే తార్కాణం.
ఈ విపత్కర పరిస్థితులలో కొందరు సోషల్ మీడియాలో అవాస్తవాలు, వివాదాలు ప్రచారం చేస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరు COVID-19  పేషెంట్లను వైద్యం  చేస్తున్న డాక్టర్ లను అపార్ట్మెంట్స్ లోకి రానివ్వం  అంటున్నారు. మరికొందరు అంత్యక్రియలకు దారి లేకుండా స్మశానాలలోనికి రానీయకుండా    అడ్డుకుంటున్నారు . మరికొందరు కరోనా  వైరస్ తో ప్రజల మధ్య కలహాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. మరికొందరు కరోనా వైరస్ తో భయానక  వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం తో సమానమైన పనులు. ఇది విమర్శలకు ప్రతి విమర్శలు సమయం కాదు . జాతి మొత్తం  ఒకే మాటపై నిలిచి కరోనా బారి  నుండి దేశాన్ని కాపాడాలి.
అధికారుల, వైద్యుల,పోలీసుల మరియు పారిశుద్ధ్య కార్మికుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. " 

 "ముమ్మాటికీ  వైరస్ ల  మీద మానవ జాతి దే విజయం"

యు.సురేంద్ర 
ఎ. పి.టి.యఫ్.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |