APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF VOICE
Showing posts with label APTF VOICE. Show all posts
Showing posts with label APTF VOICE. Show all posts
విద్యారంగానికి_ఉపాధ్యాయులకు_చేదు_జ్ఞాపకాలను_మిగిల్చిన_2022

విద్యారంగానికి_ఉపాధ్యాయులకు_చేదు_జ్ఞాపకాలను_మిగిల్చిన_2022

Mohan
APTF Updated at: January 02, 2023

#విద్యారంగానికి_ఉపాధ్యాయులకు_చేదు_జ్ఞాపకాలను_మిగిల్చిన_2022

"పాముకు కాటేసే పని, తేలుకు కుట్టే పని, ఎండ్రకాయకు రక్కే పని" అన్నాడు మునుపటికో పెద్దాయన! కానీ ఆయా జీవులు తమ మనుగడకు ఇబ్బంది కలుగుతుందనో, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భావించినపుడు మాత్రమే వాటిలో ప్రతీకార ప్రతిస్పందన కనిపిస్తుంది. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విషపూరిత సర్పాలను తలపించేలా భావిస్తున్న వాటికంటే ప్రమాదకరమైన వారు విద్యాశాఖలో అధికారులై తిష్టవేశారు. వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడంలో వారు ఎత్తిన పిడుగులు. టీచర్లను  వేపుకుతినడంలో నలమహారాజంతటి చేయి తిరిగిన వారు సదరు మేధావులు.  సామాజిక స్పృహతో, ఎంతో గంభీరంగా కొన్ని దశాబ్దాలుగా జీవనదిలా సాగిపోతున్న విద్యారంగంలో రెండు దశాబ్దాల కిందట ఆరంభమైన తిరోగమన విధానాలు ఇపుడు తారాస్థాయికి చేరాయి. కార్పొరేట్ దున్నుతో నడపబడుతున్న ప్రభుత్వాలు  తమ శక్తివంచనమేర విద్యారంగాన్ని పడగొట్టేందుకు
 విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

కొత్త సంవత్సరం. అయినా మాయని గాయాలు, మారని గాధలు గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవలసిందే!  మధురస్మృతులైతే కొన్ని ఘడియలు స్మరించుకుని విస్మరించవచ్చు. కానీ గతంలో నాటిన విషపు మొక్కలు రేపటిరోజున బీజాలను వెదజల్లి తమ పునరుత్పత్తితో సమాజపు విజ్ఞానకాంతులను శాశ్వత గ్రహణంలా కబళి0చబోతుంటే ఒక సామాజిక వాదిగా వడిగా, వాడిగా, వేడిగా స్పందించక తప్పనిసరి. విద్యావ్యవస్థకు, ఉపాధ్యాయవర్గానికి సమీప భవిష్యత్తులో కాళరాత్రులే కనిపిస్తున్నాయి. 

తెలుగు మాధ్యమం రద్దు
భాషా ప్రయుక్త రాష్ట్రంలో ప్రజల  గొంతుకే భాష. ఆ భాషను బోధనా మాధ్యమంగా రద్దు చేయడమంటే ఆ గొంతుకను నులిమేయడమే.  ప్రాచీన కాలం నుంచీ పామరుల మొదలు పండితులు వరకు ఒడిసిపట్టిన భాషను దెబ్బతీశారు. జాతీయస్థాయిలో గుర్తింపు కలిగి అంతర్జాతీయ వేదికలపై సత్కారాలు అందుకునేందుకు ఉన్న ఆధారాన్ని తెగేశారు.  కేవలం తమ మాట చెల్లాలని పాలకులు పెడధోరణిని ఎంచుకున్నారు కానీ తాము చేస్తున్నది ఎంతటి తప్పిదమో, ఎందటి పరిపక్వ విధానమే వారు గుర్తించలేకున్నారు.  విద్య పాలకులకు లాభసాటి వ్యాపారం కాదు. అందుకే అందులో వ్యయాన్ని తగ్గించుకొని తమ ప్రాధాన్యతలకు నిధులు దారి మల్లించాలని చూస్తున్నారు. అందుకే టీచర్ పోస్టుల రద్దు ద్వారా బడ్జెట్ ను తమ అదుపులో ఉంచుకునేందుకు వ్యూహాత్మకంగా మాధ్యమం రద్దు సాహసానికి ఒడిగట్టారు.
*బోధనలో భాష ఒక వరం. మాధ్యమం అనేది జీవనాడి. అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు తమ ప్రకంపనల మార్పిడికి పరస్పరం సహకరించే వాహక తంత్రి.* దాన్ని భంగపరిచే యత్నంపై తెలుగోడి గొంతుక ఒక్కటై నినదించాలి. భాష రక్షణకు నడుం బిగించాలి. తెలుగు బోధనా మాధ్యమం రద్దుపై మొత్తంగా ఒక మహోద్యమం రావాల్సిందే!

√ విద్యా వ్యవస్థకు సవాలు విసిరిన జీఓ 117
జాతీయ విద్యా విధానం 2020 అమలు విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాలతో సహా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చూసీచూడనట్లున్నా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం వద్ద ఆగ్రాసనం పొందేందుకు పరుగులు పెట్టింది. కనీస చర్చ జరక్కుండా పార్లమెంటులో ఆమోదం పొందిన విద్యా విధానంపై రాష్ట్రంలో మేధావి వర్గంతో కానీ, ఉపాధ్యాయ సంఘాలతో సాధారణ చర్చ కూడా జరగలేదు. దానివల్ల వచ్చే ఉపద్రవాన్ని ముందస్తుగా అంచనా వేయలేదు. కనీసంగా అధ్యయనం లేకుండా విద్యారంగంపై పిడుగులా పడింది. ప్రధానంగా 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంలోనూ తప్పటడుగులు పడ్డాయి. ఎంతో బలంగా ఉన్న ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కవుదుటన అధఃపాతాళానికి పడిపోయింది. టీచర్లను మిగులు తేల్చే పధకం విజయవంతం చేశారు. నాడు-నేడు పధకం ద్వారా నిండిన పాఠశాలలను ప్రభుత్వ చర్యల పర్యవసానంగా వెలవెల పోయే పరిస్థితికి దారితీసింది.

√ పదోన్నతులు
ప్రతినెలా మొదటి వారంలో తొలి పనిదినం రోజున ఏ విధంగా ఏర్పడిన ఖాళీలనైనా పదోన్నతుల ద్వారా 70:30 నిష్పత్తిలో నింపాలనేది గత ప్రభుత్వాలు రూపొందించిన నిబంధన. 
కానీ దాన్ని ఇప్పుడు ప్రహసనంగా మార్చేస్తున్నారు. సాంకేతికత పేరుతో పదోన్నతుల ప్రక్రియ ముగిసినా అందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. జిల్లా స్థాయిలో పూర్తయ్యే వ్యవహారం ఇపుడు కమీషనర్ స్థాయికి చేరిపోవడం చిత్రంగా లేదూ! 

√ కేడర్ల అయోమయం
అంతటితో ఆగలేదు. పాఠశాల స్థాయిని బట్టి అక్కడ పనిచేయాల్సిన ఉపాధ్యాయుల కేడర్ ను ఎప్పుడో నిర్ణయించారు. ఉన్నత పాఠశాలల్లో  స్కూల్ అసిస్టెంట్లు (వివిధ సబ్జెక్టుల), ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్  అసిస్టెంట్లు నియమించే విధానం ఉంది. ఆమేరకు 2002 నవంబర్లో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ లను పెద్దయెత్తున రీ డిప్లాయ్మెంట్ చేసి ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు పంపారు. ఇప్పుడేమో 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్స్ అంటున్నారు. 98 కంటే తక్కువగా విద్యార్థులున్న పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను, ప్రధానోపాధ్యాయులను, వ్యాయామ ఉపాధ్యాయులను తప్పించేస్తున్నారు. పంచతంత్ర కథల్లో కూడా లేని ద్వంద్వనీతిని అనుసరించడాన్ని ఏమనాలి? ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల సంఖ్యకు కత్తెర వేసే పన్నాగం ఇది. ఉపాధ్యాయ శిక్షణలోనే స్పష్టమైన తేడాలుండగా దాన్ని గుర్తించకున్నారు. అంతేకాకుండా పి.ఎస్. హెచ్. ఎం. పోస్టులు కూడా ఇక కాలగర్భంలో కలుసిపోనున్నాయి. 

√ ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం 2010)
2010 సంవత్సరం సరిగ్గా ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్స్ అంటూ కొంటె కోణంగులు జరుపుకునే పండుగారోజున విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఒక పుష్కర కాలం తర్వాత కూడా ఆ చట్టం ఫలితాలు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే పాఠశాలలకు అందడం లేదు. అందులో ప్రధానమైనది తరగతికో ఉపాధ్యాయుడు, పదిశాతం పేద పిల్లలకు ప్రయివేట్ పాఠశాలలల్లో విద్యాభ్యాసం అందించడం, ఆవాసానికి అందుబాటులో పాఠశాలలు ఏర్పాటు చేయడం. ఇవన్నీ నీటిమూటలుగా మిగిలిపోయాయి. 

√ సృజనాత్మక బోధనా పద్దతులతో తరగతి గదిలో స్వేచ్ఛగా పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఇపుడు అణువణువునా శల్య పరీక్షలు చేస్తున్నారు.  అనుమానపు విధానాలు సృష్టించి అవమానిస్తున్నారు. మెరుణగధీరుల్లా సగర్వంగా తలెత్తుకుని గంభీరంగా సాగే ఉపాధ్యాయులు ఇపుడు తాము పనిచేసే ఊర్లోనే బిత్తరచూపులతో తడబడే నడకలతో సాగుతున్నాడు. విద్యార్థులను ప్రయోజనవంతులుగా తీర్చిదిద్దే బాధ్యతలు కాకుండా నిస్సహాయులయారు.
ఎన్నో ఉత్తానుపతనాలను చవిచూసిన ఉపాధ్యాయలోకం ఇపుడు చాలా కలవరపడుతోంది. ప్రభుత్వ చర్యలే ఇందుక్కారణం. అధికారుల వైఖరులే వారిని బలహీనులుగా మార్చేసాయి. ఉపాధ్యాయుల దైనందిన జీవితాలు బోధనకు బదులు సెల్ ఫోన్ ద్వారా యాపులు వేసే గుదిబండతోనే సరిపోతుంది. ముఖ హాజరు, డైరీ రాయడం, విజిట్లు, పాఠ్యప్రణాళికలు పేరుతో వారిని భయకంపితులను చేసేస్తున్నారు. శిక్షణకు హాజరైనా కనీస భత్యం, చార్జీల చెల్లింపుల్లేవ్. ఫోన్ ఇంటర్నెట్ ఉపాధ్యాయుల జేబు నుంచి చెల్లించాలి. ఈ రుస్తుం విధానం ప్రజా ప్రభుత్వాల నైతికతను ప్రశ్నిస్తోంది. అలానే ఉపాధ్యాయుల విశ్వసనీయత ప్రశ్నార్ధకమవుతోంది. పోనీ నెలవారీ అయినా జీతాలు సక్రమంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. సమాజంలో ఉపాధ్యాయులు ఆర్ధిక విశ్వసనీయత కోల్పోయారు. 

√ సాధారణ పరిపాలనా శాఖ ప్రతియేటా సెలవులను నిర్ధారిస్తుంది. ఆ ఉత్తర్వులను అన్నిశాఖలు విధిగా పాటించాలి. కానీ విద్యా శాఖ రూటే వేరు. జీఓ ను తమ చెప్పుచేతల్లోకి తీసుకొని ప్రత్యేకంగా సర్క్యులర్లు ఇస్తూ జీవోలను ఉల్లంఘించడమే కాకుండా ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తోంది. ప్రకృతి వైపరీత్యాలవల్లనో, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లోనో మార్పులు చేర్పులు ఆహ్వానించవచ్చు. కానీ ప్రతి విషయాన్ని రాద్దాంతం చేయడం, సంఘాలు వెళ్లి సహస్ర విజ్ఞాపనలు ఇవ్వడం పైనుంచి కిందకు మార్పుల సమాచారం అందేటప్పటికి పుణ్యకాలం గడిచిపోవడం చాలా సందర్భాల్లో చూశాం. 

√ పరీక్షల నిర్వహణలోనూ తొట్రుపాటు!
విద్యాసంవత్సరం మొదలైన తర్వాత పరీక్షల నిర్వహణలో విపరీతమైన కాలయాపన జరిగింది. ఇప్పటికే మూడు సమ్మెటివ్ పరీక్షలు రెందుకు కుదింపబడ్డాయి. కొత్త యేడాదిలో అయినా సంస్కరణలు రావాలని కోరుకుందాం. 

√ 2022 బదిలీల ప్రహసనం

2022 లో బదిలీలు నిర్వహణకు ఏ ముహూర్తాన ఉత్తర్వులు వెలువడ్డాయో కానీ   సవాలక్ష సమస్యలు సృష్టించాయి. దీర్ఘకాలికంగా బదిలీలకోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుత పరిస్థితి ఆశనిపాతంగా పరిణమించింది. ఉపాధ్యాయుల ప్రయోజనాలకు  విఘాతం కలిగిన దరిమిలా వేలాదిమంది కోర్టు మెట్లెక్కారు. ఎన్నో సవరణలు వచ్చినా చట్టాలను సంతృప్తి పరచలేకపోయాయి. మొత్తానికి బదిలీలు జరిగే వాతావరణం ఇప్పట్లో లేనట్లే! 

పీఆర్సీ, కరువుభత్యం,  సీపీఎస్ రద్దు వంటి అంశాలపై ఎంత మాట్లాడితే అంత కంఠశోష!  ప్రభుత్వ బలం ముందు సంఘాల కార్యశీలత నిష్క్రియాపరత్వమైంది. ప్రభుత్వ అనుకూల సంఘాల మొకరిల్లే విధానంవల్ల మరెన్నో చేజార్చుకునే ప్రమాదం ఏర్పడింది. మున్ముందు రోజుల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడితే తప్ప పోగొట్టుకొంటున్న ప్రయోజనాలు, చేజార్చుకున్న హక్కులు పునరుద్ధరింపబడే అవకాశం లేదు. ఉవ్వెత్తున ఎగిడిపడిన పీఆర్సీ ఉద్యమంతో ప్రారంభమైన 2022 కనీస ఫలితాలను రాబట్టుకోలేకపోగా ఉన్నవి జరవిడుచుకున్న విపత్కర పరిస్థితి నుండి బయటపడాలి. 

-మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్ 1938

ఉపాధ్యాయ బదిలీలకు శాశ్వత కోడ్ ఏర్పాటు చేయాలి!  మోహన్_దాస్

ఉపాధ్యాయ బదిలీలకు శాశ్వత కోడ్ ఏర్పాటు చేయాలి! మోహన్_దాస్

Mohan
APTF Updated at: December 21, 2022

 ఉపాధ్యాయ బదిలీలకు శాశ్వత కోడ్ ఏర్పాటు చేయాలి!

బదిలీల ముసుగులో పోస్టుల రద్దు... 

ఇదో పెద్ద కుంభకోణం....


(మోహన్_దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్_1938)


ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం పైలా (పెహ్లా) పచ్చీసు ఆడుతోంది. ఏదైనా ఒక వ్యవస్థలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలుచేయాలని భావించినపుడు సంబంధీకులతో కనీస సంప్రదింపులు జరపడం ఒక సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు ఒకటిన్నర లక్షల పైచిలుకు ఉండగా వారిని బదిలీల్లో ప్రభావితం చేయడమంటే సామాన్యమైంది కాదు. కానీ ప్రభుత్వం చాలా ఆషామాషీగా తీసుకొంది. ప్రభుత్వంచేత కితాబు పొందాలని ఉవ్విల్లూరిన అధికారులు కూడా లేడికి లేచిందే పరుగుగా వ్యవహరించారు. ఈ వైఖరి ఇపుడు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను శాప గ్రస్థమ్ చేసింది.

బదిలీలు చేపట్టినా, రేషనలైజేషన్ చేసినా, పాయింట్లపై రాయబేరాలు నడిపినా, న్యాయపోరాటాలకు దిగినా, ఆందోళనలు చేపట్టినా అంతిమ లక్ష్యం విద్యార్థి, పాఠశాల మనుగడ అయి ఉండాలి. 


అవన్నింటినీ గాలికి వదిలి రెండువైపులా స్వీయ ప్రయోజనాలే ప్రామాణికంగా ప్రాకులాడుతున్న క్రమాన్ని సామాజం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? 


ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్యలో కోత విధించాలని భావించవచ్చు.  లాభాలు లేని వ్యవస్థగా క్రమేపి భారం తగ్గించుకోవాలని చూడకూడదు. 

తడిసి మోపెడవుతున్న బడ్జెట్ ను అదుపుచేసే ప్రయత్నం కావచ్చు. ఉపాధ్యాయులను సాధింపులకు గురిచేసే ప్రయత్నమయినా, విద్యారంగాన్ని సంస్కరించాలనే విశాల ధృక్పధమైనా అయివుండాలి. వాస్తవానికి బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టడం విద్యార్థులు, ఉపాధ్యాయులకు శ్రేయోదాయకం. కానీ ప్రయోజనకరమైన విధానాలపై ఆసక్తి చూపని ప్రభుత్వం మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్న దశలో బదిలీల చేపట్టడంపై స్తబ్దుగా ఉండిపోయిన ప్రభుత్వం అకస్మాత్తుగా రేషనలైజేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం అసలు దాని ఆనవాళ్లు బయటికి పొక్కకుండా వివిధ రకాల సమస్యలకు ఆజ్యం పోసింది.  బదిలీల పర్వ0లో ఒకనాటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇప్పటి కౌన్సిలింగ్ ప్రక్రియకు దోహదం చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఆ విధానంలోనే ఎన్నో బదిలీలు జరిగాయి. అయితే ఇప్పుడు ఎదురైనన్ని సందేహాలు ఎప్పుడూ తారస పడలేదు. ప్రభుత్వ కనుసన్నల్లో అధికారుల్లో ఉపాధ్యాయుల పట్ల ఏర్పడిన అణిచివేత అనే జాఢ్యం ఇపుడు తారాస్థాయికి చేరింది. అదే కౌన్సెలింగ్ విధానం ఈనాడు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ గా మార్పు చెంది ఉపాధ్యాయుల జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఉపాధ్యాయులను గ్రూపులుగా విడగొట్టింది, ఓకే స్కూల్లో పనిచేస్తున్న వారి మధ్య కూడా విద్వేషాలకు ఆజ్యం పోసింది. పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యా సంవత్సరం  సంఘాలు వివిధ సమస్యలను ప్రస్తావించడం, వాటిపై సమావేశాలు  నిర్వహించడం అందులో సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలపడం, తదనంతరం వాటిపై భిన్నమైన విధానాలు ప్రకటించడం, ఇచ్చిన జీఓ కు విపరీతార్ధం తీయడం. ఇలా గంటగంటకీ జాబితాలు మారుతున్న నేపధ్యంలో ఉపాధ్యాయులలో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడుతోంది. ప్రభుత్వ విధానాల వల్ల సంఘాల మాట చెల్లుబాటు కాకుండాపోయింది. ప్రభుత్వ అనుకూల సంఘాల సంగతి పక్కన పెడితే సామాజిక కోణంలో పనిచేస్తున్న ఏపిటీఎఫ్ లాంటి సంఘాలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికే జీఓ 117 పై అనుబంధ ఉద్యమ సంఘం విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా కోర్టులో కేసు నడుపుతోంది. ఉపాధ్యాయులను సంఘాలపైకి ఉసిగొల్పేలా చేసింది. సంఘాల మనుగడపై సవాలు విసిరిన దృశ్యం. సంఘాలను ఉనికిని ప్రశ్నార్ధకం చేసే కుట్ర ఇది. 

గడిచిన వారం రోజులుగా వారికి కంటి మీద కునుకులేకుండా చేసింది. మొత్తానికి ప్రభుత్వ లక్ష్యం నెరవేరివుండొచ్చు గానీ విద్యావ్యవస్థ మొత్తాన్నీ త్రిశంకుస్వరంలోకి నెట్టబడింది. పాతిక వేలకు పైబడి ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన పరిస్థితి నుంచి పాతిక వేల పోస్టులు మిగులు తేల్చే స్థాయికి ప్రభుత్వం చేసిన కసరత్తు ఫలితాలను సాధించింది. ప్రభుత్వ పొంతన లేని విధానాల పుణ్యమా! అని అసలు ఒక సమగ్ర విధానమే లేకుండాపోయింది. 


#ఉదాహరణకు

■  పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు నియమిస్తాం - ప్రభుత్వం

√ నిజమే మెర్జ్ అయిన పాఠశాలలకు (3- 10 తరగతులు) మాత్రమే ఈ అవకాశం ఉంది. 

× మరి 98 లోపు విద్యార్థులున్న పాఠశాలలకు సబ్జెక్టు టీచర్లు అవసరం లేదా?

× ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు అక్కర్లేదా?


2021 కి ముందు ప్రాధమికోన్నత పాఠశాలలను బలోపేతానికి సబ్జెక్టు టీచర్ పోస్టులు కేటాయించిన ప్రభుత్వం ఇపుడు అక్కడ పోస్టులు రద్దు చేస్తూ జారీ చేస్తే ఆ ఉత్తర్వుల పాపం ఎవరిది?


13 లక్షలకు పైబడి ఉద్యోగులు, కార్మికులు ఉన్న రైల్వే శాఖలో కూడా బదిలీల్లో ఇంత అలజడి లేదు. ఒక్క రెండు లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులు, 3.25 లక్షల ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉన్న కర్ణాటకలోనూ ఎంతో హుందాగా సాగుతోంది. 3.57 లక్షల మంది మహారాష్ట్ర లోనూ, 3.31 లక్షల మంది రాజస్థాన్ లోనూ, 3.32 లక్షల మంది తమిళనాడులోనూ, ఉత్తర ప్రదేశ్ లో  2.17 లక్షలు, పశ్చిమబెంగాల్ లో 2.21 లక్షలు ఉపాధ్యాయులు సెకండరీ స్కూళ్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా ఇలాంటి రాద్దాంతం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ నిత్య గొడవేంటి? అందుకు ఒకసారి పూర్వాపరాలను సమీక్షించాలి.


జీఓ 117 పై ఇంకా తుది నిర్ణయం రాకముందే మాతృభాషలో విద్యాబోధన అనే అంశం హైకోర్టులో ఒక కొలిక్కి రాకముందే ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు తెరలేపడం సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చడమే! 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడం ఒక చారిత్రక తప్పిదం. దానిని సవరించకుండా ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరే!

అందుబాటు అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరకుండానే  చాలా స్కూళ్లకు గెడియలు వేసింది.


బదిలీలలో ప్రతి ఒక్కరినీ స్వార్ధం అనే కోరికను కొంత ప్రభావితం చేసింది. 

అందువల్లే అందుబాటులో పాఠశాల ఉండాలనే సహజ కోరికతో అనేకమంది తమ కోర్కెలను సాకారం చేసుకునేందుకు కొందరు, తమ హక్కుల కోసం మరికొందరు 

ఇపుడు న్యాయస్థానం తలుపులు తట్టారు.  వందలాది మంది హైకోర్టులో కేసులు వేయడాన్ని బట్టి ఒక్క విషయం అర్ధమౌతోంది. బదిలీలు సజావుగా నిర్వహించాలనే ఆసక్తి ప్రభుత్వానికి లేదని. అర్ధవంతమైన ప్రతిపాదనలు అందులో లేకపోవడంవల్లనే ఉపాధ్యాయులు న్యాయం కోసం ఘోషిస్తున్నారనేది వాస్తవం. అందరికీ సహజ న్యాయం జరిపించాలనే స్పృహ అధికారులలో కొరవడింది నేపధ్యంలోనే సవాలక్ష సమస్యలకు అంకురార్పణ జరిగింది. అందువల్లనే అనేకమంది కోర్టుల్లో న్యాయం కోసం వ్యాజ్యాలు వేశారు. ఉపాధ్యాయుల జీవితాలు ఒక సమస్య నుంచి మరో సమస్యకు చేసే ప్రయాణంగానూ అతడో/ఆమె బాహుదూరపు బాటసారిగానూ మిగిలిపోతున్నారు.


√ స్పౌజ్ పాయింట్లు శాశ్వతంగా ఉపాధ్యాయులకు రద్దు చేయాలనే డిమాండ్

√ ప్రిఫరెన్షియల్ కేటగిరీ రద్దు చేయాలనే డిమాండ్ 

√ రేషనలైజేషన్ రద్దు చేయాలనే డిమాండ్

√ ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ రద్దు చేయాలనే డిమాండ్

√ ప్రమోషన్స్ వేకెన్సీ ఖాళీల ప్రదర్శన రద్దు చేయాలనే డిమాండ్

√ ఒక ప్లేస్ లో నియామకం పొందిన తర్వాత అక్కడ 8 సం౹౹ కొనసాగించాలనే డిమాండ్

√ రేషనలైజేషన్ పాయింట్ల విధానం రద్దు డిమాండ్ 

√ సీనియర్లకు కూడా న్యాయం చేయాలని డిమాండ్


ఇలా ఎన్నో పొంతన లేని, సానుకూల డిమాండ్లతో అనేక గొంతుకలు ఘోషిస్తున్నాయి. బదిలీల దరఖాస్తుల వల్ల

తమకు ఆయాచితంగా ఎదురైన సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పడిగాపులు కాసే స్థితికి చేర్చారు. ఈ నేపథ్యంలోనే బదిలీల నిర్వాహణకు ఒక  శాశ్వత కోడ్ ఉంటే బాగుంటుందనే డిమాండ్ కు మరింత ఊపందుకుంది. అసంబద్ధతకు, అసమతుల్యతకు మారుపేరుగా మిగిలిన అసంబద్ధ జీఓ 187 కు బదులు శాశ్వత కోడ్ ఏర్పాటు ఆవశ్యకతను గుర్తు చేసింది.


ధన్యవాదాలతో...

■మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్ 1938.

ఉపాధ్యాయుల జీ(వి)తాలపై ఉక్కుపాదం! ఇదేనా ప్రజారంజక పాలన?

ఉపాధ్యాయుల జీ(వి)తాలపై ఉక్కుపాదం! ఇదేనా ప్రజారంజక పాలన?

Mohan
APTF Updated at: December 10, 2022

 కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధుల వేతనాలు  ఠ0చనుగా ఒకటో తేదీ బ్యాంకు అకౌంట్లలో చేరిపోతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు అందుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థాయికి చేరడం ఒక దురదృష్టకర సంఘటన. కొన్ని శాఖల ఉద్యోగులపై ఒకటో తేదీ అభిమానం చిలకరించారు. అంటే రాష్ట్రమంతా ఒక యూనిట్ గా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల మధ్య కనిపించని విభజన రేఖను గీశారు. చెప్పకనే సగటు ఉపాధ్యాయులపై అవిశ్వాసం ప్రకటించిందీ ప్రభుత్వం.  విచిత్రంగా ఉపాధ్యాయులకు నవంబర్ జీతాలు ఇప్పటికీ (డిసెంబర్ 9) కొన్ని జిల్లాల్లో జమ కానీ పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాది కుటుంబాల్లో ఆర్ధిక దిగ్బంధనం ఏర్పడింది. కేవలం జీతాలపైనే జీవితాలను వెళ్లదీస్తూన్న కుటుంబాల్లోని పొయ్యిలో నుండి పిల్లి బయటకు లేవని స్థితి కూడా ఉంది. ఇటీవలి కాలంలో ఒకటో తేదీ అంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. కారణం కూటికి, గుడ్డకు సంబంధించిన అంశమే కాదు. గతకాలపు అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీలు. సకాలంలో చెల్లించకపోతే పరువునష్టం సమస్య. ఇల్లు గడవాలంటే జీతమే ఆధారం కావడం. ఆయా  ఉద్యోగులపై ఒకరికి నలుగురు ఆధారపడి ఉండడం.  ప్రభుత్వోద్యోగి అంటే ఒకప్పుడు సమాజంలో మర్యాద, మన్నన ఉండేవి. ఇప్పుడా పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వద్యోగులకు అప్పు పుట్టని స్థాయికి చేరింది.  ఒక చులకన భావం ఆయా వ్యక్తుల చుట్టూ ఆవర్తనంలా ఆవరించింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ అవసరాలు తీరక ఆయా కుటుంబాలు నవ్వుల పాలవుతున్నాయి కూడా! గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ తటస్థించ లేదు, 010 హెడ్ లేనప్పుడు కూడా ఒక్క మార్చి నెల జీతం తప్ప. ఏప్రిల్ నెల జీతాన్ని ఏప్రిల్ 24 నే (పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మరుసటి రోజు) చెల్లించేవారు. అంటే ఏప్రిల్ నెలలో 20 రోజుల తేడాతో రెండు జీతాలు అందుకునే వారు. ముందస్తు ఆడిట్ ఉన్న మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మాత్రమే వేతనాల చెల్లింపులో కొద్దిగా జాప్య0 జరిగేది.


అంతే కాదు....

ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చివరి పనిదినం రోజున వారికి రావలసిన సమస్త ప్రయోజనాలను అందజేసి, చివరకు పెన్షన్ పేపర్లు సైతం చేతిలో పెట్టి సాదరంగా ఇంటికి పంపే ఆనవాయితీ ఉండేది. అదొక మర్యాద. అది అనాడున్న రాజనీతి. ఆనాడు పాలకులకు ఉద్యోగులపై వున్న గౌరవం. ఉద్యోగులను  ఆంతగా ఆదరించారో చెప్పనలివి కాదు. 1956 నుండి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగస్వామ్యానికి పాలకులు ఆగ్రాసనం వేశారు. తదనుగుణంగానే ఉద్యోగులు స్వేచ్ఛగా  స్వామిభక్తితో పని చేసారు. ప్రజలకు సేవలను కొనసాగించారు. వృత్తిరీత్యా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి నేరుగా చొరవచూపేవారు. సంఘాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రజలనాడిని, ప్రజా సమస్యలను పత్రికల్లో వచ్చే వార్తల ద్వారా కూడా స్వీకరించేవారు. అందుకోసం సమాచార, పౌర సంబంధాలశాఖ ఉండేది.  పత్రికలలో మూడు సెంటీమీటర్ల సింగిల్ కాలమ్ వార్త వచ్చినా విచారణ జరిపించే సంస్కృతి ఉండేది. బాధ్యులపై తక్షణ చర్యలుండేవి.     బాధితులకు సత్వరం న్యాయం జరిపించేవారు. మధ్యవర్తులు, సలహాదారుల పెత్తనం అసలుండేది కాదు. సంఘాల నేతలే అనుసంధానకర్తలుగా ఉంది స్తబ్దతను తొలగించేవారు. పీఆర్సీ చర్చలకు సైతం కాలయాపన ఉండేది కాదు. పాతికో పరకో ఎంతో కొంత తేల్చి ఉత్తర్వులను ఒకేసారి జారీచేసేవారు. కానీ ఇపుడు  కాలం తలకిందులైంది. ప్రతి విషయాన్ని సమస్యగా చూపుతున్నారు. సున్నితమైన అంశాలను కూడా వివాదాస్పదం చేస్తున్నారు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలపై వాయిదాల పర్వము కొనసాగుతున్న అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. చివరకు బాండ్లు ఇచ్చే సంస్కృతి ఆరంభమైంది. పదవీకాలం పూర్తయిన వారి చెల్లింపులకు నిధులు లేక ఉద్యోగ విరమణ వయసును సైతం పెంచుకొంటూపోవడం ఇటీవలి కాలపు పాలకులకు అనవాయిథీ అయింది. తమ సమస్యలను ప్రస్తావించదానికి కూడా అవకాశం లేదు. ఆందోళనలు చేస్తే ఇంటిదగ్గరే అరెస్టు చేస్తారు. పని చేస్తున్న చోటనే అదుపులోకి తీసుకొంటున్నారు. కనీసం స్వాతంత్య్రం సాధించుకున్న మార్గంలో ఒక ధర్నా చేసే వీలు లేని పాశవిక విధానాలకు పాలకులు అంకురార్పణ చేశారు.


ఒకసారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 

 లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న అవిభక్త రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి చవిచూసిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ విడిపోయిన తర్వాత 2022-23 ఆర్ధిక సంవత్సరంలో  ₹ 2,56,256 కోట్లకు చేరింది. (బహిరంగ రుణాలు, ఋణ వసూళ్లు, రెవెన్యు వసూళ్లు )

ఉద్యోగుల జీతాలు బడ్జెట్ కేటాయింపుల ఫరిధిలోనివే. ఏ రంగానికి సంబంధించిన ఆదాయాన్ని ఆరంగం కోసం కాకుండా వచ్చిన ప్రతి రూపాయినీ తాము నిర్ధేశించుకున్న పథకాలకు చేరవేస్తుండడంతో ప్రతీ నెలా అప్పులకు అర్రులు చచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. విద్యారంగానికి 30 వేల కోట్లు కేటాయించగా ఆ మొత్తం మూలధనంగా ఉండడం లేదు. అంటే బడ్జెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది.  ప్రాధాన్యతా రంగాలు అట్టడుగున చేరాయి. ఉత్పాదక రంగం కుదేలయింది. వ్యవస్థలు కుప్పకూలాయి. అభివృద్ధి సంక్షేమం అనే ప్రత్యామ్నాయ రంగాలు తెరపైకి వచ్చాయి. సంక్షేమం కాస్తా నగదు బదిలీగా రూపాంతరం చెందింది. ప్రభుత్వం ఒక్క ఉద్యోగుల విషయంలో మాత్రమే బీద అరుపులు అరుస్తోంది. బడ్జెట్ లో సగానికి పైగా  1,32,126 కోట్ల రూపాయలు వివిధ రకాల పధకాల కింద లబ్ధిదారులకు చేరుతోంది. ఇది నగదు పంపిణీకి దోహదపడుతుంది కానీ ఉత్పాదనను ప్రోత్సాహకం కావడం లేదు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవ రాబడిని గుర్తించకుండా కేంద్రం, ఇతర రూపాల్లో వచ్చే నిధులనే ఆదాయంగా భావిస్తున్నారు. తెస్తున్న అప్పులు, సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చుకున్న మొత్తాలు సైతం అప్పులు, అప్పులపై వడ్డీలు చెల్లింపుకు మళ్లిస్తుండడం చూస్తున్నాం. ద్రవ్యలోటుపై నియంత్రణ కోల్పోయింది. గణాంకాల్లో తలసరి ఆదాయం కనిపించినా వాస్తవ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేవు.  'Money is a terrible monster but an excellent servant. Rulers should keep in mind while expending every rupee.'

ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. రేపటి రోజున మరింత కష్టాలు ఎదురుకానున్నాయి.  ఒక సమీకృత ఆర్థిక విధానం అవలంభిస్తే తప్ప రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రమాద ఘంటికల నుండి మనలను రక్షించలేవు . ద్రవ్యోల్బణం కొత్తపుంతలు తొక్కే ప్రమాదం ఉంది. పౌరులు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తున్న పధకాలను రుచించకుండా రాష్ట్ర భవిష్యత్తు ప్రామాణికంగా ముందుకు సాగాలి. అప్పులు చేసి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల స్వీయనిర్ణయాధికారంపై పునస్సుమీక్ష చేయాల్సిన అవసరం వుంది. దేశంలోని పౌరులను ఋణగ్రస్థులుగా మార్చే విధానాలను కట్టడి చేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తు అగమ్య గోచరమౌతుంది.

     భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఈ సందర్భంగా ఉటంకించక తప్పడంలేదు.

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన 

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి” ఉద్యోగులుగా అంకితభావంతో పనిచేసుకుంటూ పోవడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఫలితాలు భవిష్యత్తులో  అవిష్కృతమౌతాయి.

     “A dream doesn't become reality through magic; it takes sweat, determination and hard work.”  కేవలం జీతాల సమస్య గానే చూడలేం. ఇదొక విపత్కర పరిస్థితి.  రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. ఒక మేధోమదనం జరగాలి. దుబారా ఆర్థిక విధానాలతో ఎన్నటికీ సత్ఫలితాలను పొందలేమనే వాస్తవాన్ని గుర్తించాలి.

 

-మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్,  #ఎపిటీఎఫ్_1938

సాంకేతిక సమస్యలు పట్టించుకోకుండా ఫేసియల్ ఆప్ తో జీతాలకు లింకు

Mohan
APTF Updated at: December 01, 2022

 


ప్రభుత్వానికి శతాధిక నమస్సులు!  -మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్

ప్రభుత్వానికి శతాధిక నమస్సులు! -మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్

Mohan
APTF Updated at: December 01, 2022

  •  ప్రభుత్వానికి శతాధిక నమస్సులు!
  • - ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇస్తూ ఆర్డినెన్స్!
  • - అయినా ముంజేతి కంకణానికి అద్దమేల?


ఎట్టకేలకు ఉపాధ్యాయులకు స్వాతంత్ర్యం వచ్చింది. కట్టుబానిసత్వపు సంకెళ్ళు తెగాయి. కొన్ని దశాబ్దాల బా(ధ)ధ్యతల నుండి ఉపశమనం లభించింది. ఒకరకంగా చెప్పాలంటే ముక్తి దొరికింది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ వచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మకం. ప్రభుత్వాధినేతలకు ఉపాధ్యాయలోకం మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తోంది. ఇప్పటివరకు అనుభవిస్తున్న ఇబ్బందులు సునాయాసంగా మరిచిపోయారు. బోధనేతర విధుల నుండి తప్పించడం ద్వారా ఉపాధ్యాయులు పూర్తి సమయం బోధనకు కేటాయించే వీలుదొరుకుతుందని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ఎన్నికల నిర్వహణ, జనగణన విధులు బోధనకు పెద్దగా ఆటంకం కల్పించేవి కావు. అంతకంటే భయంకరమైన పనులు ఉపాధ్యాయులను బెంబేలెత్తిస్తున్నాయి. క్షణం తీరికలేని పనులెన్నో పాఠశాల ప్రాంగణంలోనే మకాం వేసివున్నాయి.  అవేంటో, బోధనా సమయాన్ని ఎంతగా కుంగదీస్తున్నాయో అటు ప్రభుత్వానికి, ఇటు ఉపాధ్యాయులకూ తెలుసు. అయినా రాత్రికి రాత్రే విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలనే తలంపు రావడం వెనుక మతలబు వేరుగా ఉందన్నది జగమెరిగిన సత్యం.  ఇటీవలికాలంలో ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి పెద్దగా పొసగడం లేదు. పీఆర్సీలో కుదింపులు, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం వెనకడుగు వేయడం, దీర్ఘకాలికంగా డీఏలు పేరుకుపోవడం వంటి ఆర్థిక సమస్యలతో పాటు, ఆర్థికేతర అంశాలైన బదిలీలు, జీఓ 117 ద్వారా పాఠశాలల మెర్జింగ్, సొంత సెల్ ఫోన్లో పేసియల్ యాప్ వినియోగంపై ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరించింది. ఈ విధానాలు  తీవ్ర అసంతృప్తి నెలకొంది.  ప్రభుత్వ సాచివేత వైఖరితో ఉద్యోగ ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారు. అదే రెండువైపులా దూరాన్ని పెంచింది. 2019 ఎన్నికల నాటికి ఉద్యోగ ఉపాధ్యాయవర్గం తమను ఆదరించగా ఇపుడు క్షేత్రస్థాయిలో  వాతావరణం భిన్నంగా ఉండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే బోధనేతర విధి అనే కారణాన్ని తెరపైకి తెచ్చిందనేది నిర్వివాదాంశం. 


స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పంచాయితీ నుండి, పార్లమెంట్ దాకా జరిగిన అన్ని ఎన్నికలను 75% పైబడి ఉపాధ్యాయులే సిబ్బందిగా నిలబడి పనిచేశారు. కె

ఎంతో ఆత్మవిశ్వాసంతో ఓటింగ్ సందర్భంగా ఎదురైన సమస్యలను, గొడవలను పరిష్కరించుకొంటూ ఎన్నికల నిర్వహించారు. అనేక సవాళ్ళను సున్నితంగా సునాయాసంగా అధిగమించడం ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమైంది. కలుషిత వ్యవస్థల్లోనూ ప్రజాస్వామ్య మనుగడకు ప్రాణాలొడ్డే తత్వం వారిది. నిద్ర, ఆహారం, లేకున్నా ఓట్లను ఒడిసిపట్టి టార్గెట్ ను ఛేదించి నిర్ణీతకాలంలో ప్రజా నిర్ణయాన్ని వెలువరింపజేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘం, అనన్యం, అద్వితీయం, అసాధారణం. వారు విలువలకు ప్రతిరూపం. విశ్వసనీయతకు సాక్ష్యం. వారెప్పుడూ, ఎక్కడా అవినీతికి, అక్రమాలకు పాల్పడిన దాఖలాలు సూన్యం. రూకలకు మొకరిల్లిన సందర్భాలు అసల్లేవ్. ముఖ్యంగా మహిళా టీచర్లకు ఇదొక ప్రధాన ఉపశమనం. ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులెప్పుడూ ఎన్నికల చిహ్నాలు చూడరు, పోటీ చేసే అభ్యర్థుల గురించి అసలు పట్టించుకోరు. వారికి తెలిసిందల్లా సకాలంలో ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకోవడమే. ప్రేరేపిత

గొడవలు జరిగినా, తలలు పగిలినా, బూతుల అక్రమించినా, నిబంధనలను అతిక్రమించినా, కొన్నిసార్లు ప్రాణాలు పోయినా బ్యాలెట్ పెట్టెను అందులోని ఓట్లను భద్రంగా రిటర్నింగ్ అధికారికి చేర్చి అర్ధరాత్రో, అపరాత్రో ఇంట్లకు చేరిన ఓర్పు, నేర్పు ఉపాధ్యాయుల సొంతం. అక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ కోసం మొహం వాఁచి ఎవరూ వెళ్లరు. అసలు వారి శ్రమను రూపాయల్లో కొలవలేరు.  అదొక బాధ్యత.  ఒకటికి శిక్షణలతో 5 రోజులు కుటుంబాలకు దూరంగా క్రమశిక్షణ తో యజ్ఞంలో సమిధల్లా చేసిన సేవలకు ఇపుడు అటవిడుపు లభించడంతో ఉపాధ్యాయుల నుండి కేరింతలు వినబడుతున్నాయి. 


భారత రాజ్యాంగం 15వ భాగంలో ప్రకరణ  324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులకు సంబంధించి సమగ్ర వివరణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. ఉపాధ్యాయులను పాఠశాలలు జరిగేరోజుల్లో ఎన్నికల విధుల పేరుతో బోధనకు దూరం చేయొద్దని ఎన్నో ఏళ్లుగా అటు కోర్టులు, ఇటు సంఘాలు కోరుతూవున్నాయి. అందుకోసం అనేక వ్యాజ్యాలు కోర్టుల్లో నడిచాయి. తదనుగుణంగా తీర్పులు వెలువడ్డాయి. 2007లో సుప్రీంకోర్టు ఆమేరకు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. మధ్యప్రదేశ్ లో  పంచాయతీ ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఆ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ను సమర్థిస్తూ  2022 జులైలో కోర్టు తీర్పునిచ్చింది. 2019లో రాజస్థాన్ లో పార్లమెంట్ ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులకు వెసులుబాటు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎన్నికల విధులకు హాజరు కాలేమని కొందరు ఉపాధ్యాయులు విన్నవించినా బిహార్లో వారికి ప్రభుత్వం సమన్లు జారీచేసిన సందర్భంలోనూ పాట్నా హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. 2017 మీలో బాంబే హైకోర్టు, 2021లో అలహాబాద్ హైకోర్టు, 2011లో మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, బోధనకు ఆటంకాలు కల్పించవద్దని తీర్పు మీద తీర్పు ఇచ్చినా నిన్న మొన్నటి వరకు వారి సేవలను అనేక యాక్టులను బూచిగా చూపి నిర్బంధంగా వినియోగించుకోవడం చూసాం. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను కొన్ని ఎన్నికల విధుల నుండి తప్పించింది. ఎఫ్ నెం. 1-3/2010 భారత ప్రభుత్వ చట్టంలోనూ ఈ మినహాయింపులున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ని అనుసరించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ఆర్టికల్ 45, ఆర్టికల్ 21 అనుసరించి  ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో నియమించరాదనే వాదనతో సుధీష్ సోమన్ అనే పౌరుడు 2010 అక్టోబర్లో కేరళ ఎన్నికల కమిషన్ పై వేసిన దవాలో 23 డాక్యుమెంట్లను సమర్పించడం జరిగింది. ఆమేరకు అయినప్పటికీ అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని సైతం వదలకుండా విధులకు నియోగించిన ప్రభుత్వం, కరోనాతో ప్రాణాలకు పెను ప్రమాదం పొంచివున్నా ఎన్నికల విధుల్లో నియోగించిన ప్రభుత్వం ఇపుడు మనసు మార్చుకోవడం శుభపరిణామం. ఇది కూడా మనకు మంచిదే!  



ఏదిఏమైనా పాలకులు అభద్రతా భావానికి గురయ్యారనేది విస్పష్టం. వాస్తవం ఏంటో ఎవరూ ఎరుగరు. ఉపాధ్యాయులు తమ ఓటును కూడా తాము వేసుకోలేని స్థితి. ఓటెవరికి వేయాలో కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని స్వచ్ఛత. అయినా   ఉపాధ్యాయులను నిర్ణయాత్మక శక్తులుగా గుర్తించారు. వారి శక్తియుక్తులు ఫలితాలను ప్రభావితం చేయగలరనే సంశయం తలెత్తింది. మరి అలాంటి వారు బయటవున్నా, లోపల వున్నా భూగర్భంలో దాచినా చేయగలిగింది చేయక మానరు కదా! ఉపాధ్యాయులు లేని ఎన్నికల నిర్వహణ కూడా ఒక చరిత్రే! ప్రజాస్వామ్యమనే ఆకాశ హర్మ్య సౌధానికి రందులద్దగలిగిన ఉపాధ్యాయవర్గానికి మరకలు అంటకుండా ఇదొక అవకాశం.


సర్వేజనా సుఖీభవన్తు!

-మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్ 1938.

ఫేసియల్ యాప్ తో జీతాలకు లింకు.... బిగుస్తున్న ఉచ్చు! -మోహన్ దాస్, ఎపిటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్.

ఫేసియల్ యాప్ తో జీతాలకు లింకు.... బిగుస్తున్న ఉచ్చు! -మోహన్ దాస్, ఎపిటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్.

Mohan
APTF Updated at: November 26, 2022

  •  ఫేసియల్ యాప్ తో జీతాలకు లింకు.... బిగుస్తున్న ఉచ్చు!
  • నిన్న కెజిబివి స్కూళ్లు... నేడు సచివాలయ ఉద్యోగులు .... 
  • తదుపరి ఉపాధ్యాయులపైనే గురి.....!
  • ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు గడ్డు కాలమే! 


        పువ్వమ్మా.... పత్రమ్మా ... అంటూ ఊరడిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రస్ఫుటం చేసింది. ఫేసియల్ యాప్ హాజరు ప్రాతిపదికన వేతనాలు చెల్లింపు అనే పిడుగులాంటి వార్త ఇపుడు చక్కర్లు కొడుతోంది. అదే ఇపుడు ఉద్యోగవర్గంలో భయాందోళన కలిగిస్తోంది.  ఉద్యోగుల్లో వురుకులు పరుగులు మొదలయ్యాయి. ప్రభుత్వద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడం కోసం 2018లో ప్రవేశపెట్టబడిన బయోమెట్రిక్ కరోనా కాలంలో అటకెక్కింది. ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత పెంచేందుకే తమ చర్యలు అని బయటికి ప్రకటించినా ప్రభుత్వాధినేతల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులను, వారి వైఖరిని ఇరుకున పెట్టాలనే వ్యూహం అంతర్లీనంగా ఉందనేది జగమెరిగిన సత్యం.  వ్యవస్థీకృత సోమరితనాన్ని రూపుమాపి సంస్థాగత పటిష్టత ద్వారా ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆశించడం ఆహ్వానించదగిన విధానమే! కార్యాలయాల్లో పేలవమైన పనితీరును ప్రక్షాళన చేయబూనడం వాంఛనీయమే. పని గంటలలో కుదురుగా పని చేయంచడం అవసమే. వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను అమలుచేయడం, సాంకేతికతను అమలు చేయడం, అనవసర కాలయాపనను సంస్కరించడం అవసరమే.


        కానీ ఆ ప్రయత్నంలో పనిగట్టుకుని వేధించే చర్యలు సహేతుకం కాదు కదా!.  ఫేసియల్ యాప్ హాజరుకు వేతనాల చెల్లింపుకు సంబంధం లేదని చెబుతూవస్తున్న ప్రభుత్వాధినేతల స్వరం మారింది. 

        ప్రస్తుత ప్రభుత్వం కొలువుదీరిన మూడేళ్ళ తర్వాత ఉద్యోగులను సమయపాలన చట్టానికి మరింతగా పదును పెట్టిన నేపథ్యంలో పరిణామాల పరంపరను ఒకసారి విశ్లేషిద్దాం. 


           అది కూడా 2022 జనవరి 7న ప్రభుత్వం వేతన సవరణ సంఘం సిఫారసులను పక్కన పెట్టి సొంత సిఫార్సులు ప్రకటించడం, ఉద్యోగవర్గాలకు ఎక్కువ నష్టం వాటిల్లడం, ఉద్యోగులు ఉద్యమ పథం పట్టడం, చలో విజయవాడ నిర్వహించి ప్రభుత్వానికి చెమటలు పట్టించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. కనీసం పీఆర్సీ నివేదిక కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల వాస్తవ ఆకాంక్షలను ప్రభుత్వం వత్తిడిగా భావించింది.  ఈ నేపధ్యంలో వారిని కట్టడి చేయాలని గట్టి నిర్ణయానికి వచ్చింది. తొలి అస్త్రంగా పనిభారం పెంచడం, క్షణం తీరికలేని విధంగా కార్యక్రమాలు అమలుచేస్తూ సెల్ ఫోన్ ద్వారానే తమకు అవసరమైన సమాచారాన్ని యాపుల్లో అప్లోడ్ చేయించే యత్నాలు ముమ్మరం చేసింది.   బయోమెట్రిక్ యంత్రాలు మంగళం పాడి ఉద్యోగ, ఉపాధ్యాయుల సొంత సెల్ ఫోన్లతోనే పేసియల్ యాప్ వేసేలా కొత్త విధానాన్ని ఆగష్టు నుంచి అమల్లోకి తెచ్చింది.  బయోమెట్రిక్ హాజరు సేకరించడం, జవాబుదారీతనం పెంచడం క్షేత్రస్థాయిలో క్రమశిక్షణ పెంచడం వంటి విషయాలు ఆహ్వానించదగినవే.


          అయితే ఒకవైపు అధికారాల వికేంద్రీకరణ అంటూనే రెండోవైపున వాస్తవాధికారాల నిర్వహణ ఉన్నతస్థాయిలో కేంద్రీకృతమౌతోంది. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసిన సందర్భంగా తిరిగి విధుల్లోకి అనుమతించే విషయం జిల్లా స్థాయి నుంచి సెక్రెటరీయేట్ కు చేరింది. మెమోకు బదులు సస్పెన్షన్ తొలి అస్త్రంగా మారింది.  కనీసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక పూట సెలవు ఇచ్చే అవశిష్ఠ అధికారం కూడా ఉన్నతాధికారుల ఖాతాలో జమయ్యింది. 


        ఉద్యోగుల శ్రేయస్సు గురించి ఇటీవల ఒక మంత్రివర్యులు సాదాసీదాగా మాట్లాడినా ప్రభుత్వ నిజ వైఖరిగానే భావించాల్సివుంటుంది. ప్రభుత్వం ఉద్యోగుల పక్షం కాదని అనేది తేటతెల్లమైంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ తమ ప్రాధాన్యత కాదని వారు నేరుగానే స్పష్టం చేశారు. అయితే ఈ ప్రభుత్వం- ఉద్యోగుల మధ్య అసమతుల్యతకు దారి తీస్తుంది. ఆ బొంద కూడా పీఆర్సీ అమలు విషయంలో ఏర్పడిందే! వాస్తవానికి సదరు పీఆర్సీ ద్వారా ఉద్యోగవర్గం బావుకున్నదేమీ లేదు. వివిధ స్లాబుల్లో కొంత శాతం ఇంటి అద్దె కోత, అశాస్త్రీయంగా, అసాధారణంగా మధ్యంతర భృతి కంటే నాలుగు శాతం ఫిట్మెంట్ నుండి తగ్గింపు, జీతాల పెంపును గణాంకాల్లో చూపి కరువు భత్యంను  మాయం చేయడం, జీతంలో పెరుగుదల బయటకు కనిపించినా ఎంత లాభం జరగాలో జరగక పోగా, లోపల ఎంత నష్టం జరకూడదో అంత కంటే ఎక్కువే జరిగింది.  మరోవైపు స్వల్పంగా పెరిగిన జీతం నుంచి ఎపిజిఎల్ఐ, పి.ఎఫ్, ప్రీమియం స్లాబులను పెంచి ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కు లాక్కుంది.  అంతే చేతికి అందని మొత్తాలకు కూడా ఆదాయపన్ను చెల్లింపు చేయాల్సిరావడం శుభపరిణామం కాదు.

        అంతే కాదు, నిజ వేతనాలు అమలు కావట్లేదు. డి.ఏ అంటే అర్థం మారిపోయింది. స్వేచ్చా విఫణిలో ధరల పెరుగుదలకు అనుగుణంగా డియర్నెస్  అలవెన్సు హెచ్చింపు లేనందువల్ల ఉద్యోగుల కొనుగోలు సామర్ధ్యం సన్నగిల్లిపోతుంది.  ఎప్పుడు ఇవ్వాల్సిన కరువు భత్యం అప్పుడు రాకపోగా సంవత్సరాల తరబడి పెండింగులో పెట్టి చివరకు రద్దుచేసి స్థాయి అధికారం రాజ్యమేలుతున్నది. నెలసరి జీతాల చెల్లింపులో జాప్యం వారి ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కుంగదీస్తోంది. జీతం చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం రుణాలు తీసుకున్న ఉద్యోగుల పరపతిని దెబ్బ తీస్తోంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో కార్యక్రమాల సాఫల్యతకు వారధులైన ఉద్యోగుల విషయంలో  ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాధం పెరిగిపోతోంది. హక్కుల అమలులో నమ్మకం  సడలుతున్నది. 


        ఈ దశలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేసియల్ యాప్ హాజరు ప్రామాణికంగా వేతనాల చెల్లింపుకు దిగితే ఉద్యోగవర్గం మరిన్ని కష్టనష్టాలను చవిచూడాల్సివుంటుంది. సాంకేతిక సమస్యలు పెద్దయెత్తున గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతుండగా ఆలస్యానికి ఆలసత్వం కారణంగానూ, అది గైర్హాజరుగానూ దానికి జీత నష్టాన్ని ప్రతిఫలంగా ఇవ్వాలని తలపోయడం వేధింపులుగానే చూడాల్సివుంటుంది. ప్రతి చిన్న విషయాన్ని సీసీఏ రూల్స్ చట్రానికి ముడిపెడుతున్న అధికారగణం చర్యలు ప్రభుత్వానికి, ఉద్యోగులకు  మధ్య గ్యాప్ పెంచేవిగా ఉంటున్నాయి. అదే సందర్భంలో సొంత సెల్ ఫోన్, ఇంటర్నెట్ ప్రభుత్వం కోసం వినియోగించాలని నిబంధన కూడా ఎక్కడా లేదు.  ఈ దశలో స్ధానిక డీడీఓ లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సివుంటుంది. ప్రత్యేకించి విద్యారంగాన్ని ఇతర శాఖలతో పొల్చడం  సారి కాదు.


        బోధనా సమయంలో ఇతర బాధ్యతలు ఇరుకున పెడుతున్నందున అన్నింటికీ మించి తరగతిలో స్వేచ్ఛ తగ్గుతోంది. వీటన్నింటి ఒకసారి పరిశీలించి తదనుగుణంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత. గోవ్యాఘ్ర కదనం అవాచనీయం.!


-మోహన్ దాస్, ఎపిటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్.



ముఖ ఆధారిత హాజరు యాప్ ( పేసియల్ యాప్) లోపాల పుట్ట

ముఖ ఆధారిత హాజరు యాప్ ( పేసియల్ యాప్) లోపాల పుట్ట

Mohan
APTF Updated at: November 10, 2022

 ఉద్యోగ, ఉపాధ్యాయుల హాజరును నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పేసియల్ యాప్ లోపాల పుట్టగా మారింది.  వారి సొంత ముఖాలు దెయ్యపు ప్రతిబింబాలై వెక్కిరిస్తున్నాయి. కనుచూపు మేరలో ఈ సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం లేకపోయినా వాటియొక్క ప్రకంపనలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. 


ఈనేపథ్యంలో యాప్స్ గురించి, వాటిని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని గురించి ఒకసారి విశ్లేషిద్దాం.


సాఫ్ట్వేర్ మార్కెట్లో అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలికాలంలో ముఖ గుర్తింపు వ్యవస్థలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.  వ్యక్తి యొక్క నిజ గుర్తింపును గుర్తించడానికి మరియు ప్రామాణీకరించడానికి సిస్టమ్‌లు ప్రత్యేకమైన ముఖ లక్షణాలను కొలుస్తాయి మరియు సరిపోల్చుతాయి.  ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ ఇమేజ్‌లను గుర్తించడానికి మరియు వాటిని డేటాబేస్‌తో సరిపోల్చడానికి కెమెరాను ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానిస్తుంది. వాస్తవానికి ఈ యాప్ లు  బాధితులను గుర్తించడానికి లేదా నిందితులను పట్టుకోవడానికి ఈ యాప్ లు తొలినాళ్లలో పాశ్చాత్య దేశాలు ఎక్కువగా వినియోగిస్తూ వచ్చాయి.  నిరంతరం గుర్తించాల్సిన చట్ట అమలు సంస్థలచే ఎక్కువగా ఉపయోగించబదుతున్నాయి. 


“లెన్సులు,” మరింత వ్యావహారికంగా సెల్ఫీ ఫిల్టర్లు లేదా “ఫిల్టర్‌లు” అని పిలుస్తారు, ఇవి పూర్తిగా పనికిమాలిన ఫీచర్‌గా అనిపించవచ్చు.  కానీ వాటి వెనుక ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అధునాతనమైనది, ఆకట్టుకునేది… మరియు కొంచెం భయానకంగా ఉంది.  చాలా బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ ఈ ముఖ గుర్తింపు వ్యవస్థను కూడా ఉపయోగిస్తోంది, ఇది వ్యక్తిని ప్రామాణీకరించడంలో సహాయపడుతుంది మరియు బ్యాంకింగ్ సిస్టమ్‌ను యాక్సెస్ చేయడానికి మరియు లావాదేవీలను పూర్తి చేయడానికి వారిని అనుమతిస్తుంది.  వాస్తవానికి, నిర్దిష్ట మొబైల్ పరికరాలు పరికరాన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారుని అనుమతించే మార్గంగా ఉపయోగిస్తాయి.  డిజిటల్ యుగంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కోసం చాలా అప్లికేషన్లు ఉన్నాయి.


 ముఖ గుర్తింపు వ్యవస్థలు ఎలా పని చేస్తాయి?


 ఒక వ్యక్తిని గుర్తించడానికి అవి ముఖ లక్షణాలకు సరిపోతాయి.  భౌతిక లక్షణాలు వ్యక్తిని ప్రత్యేకంగా చేసే లక్షణాల వైపు చూపడం లక్ష్యంగా పెట్టుకుంటాయి.  కెమెరా లేదా ఇతర మూలాధారాలను ఉపయోగించి డేటా తీసుకోబడుతుంది మరియు ఆ డేటా ఇన్‌పుట్ సిస్టమ్ లేదా సర్వర్‌లో ఇప్పటికే ఉన్న డేటాతో సరిపోలుతుంది.  మొదట, కెమెరాను ఉపయోగించి గుర్తించడం జరుగుతుంది.  గుర్తించే దశ ముగిసిన తర్వాత, గుర్తించబడిన ముఖం కోసం ఫేస్‌ప్రింట్ సృష్టించబడిన దశను చూస్తారు.  చివరగా, రెండూ సరిపోల్చి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.


 ఒక మాల్‌లో ముఖాన్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయనుకోండి.  ఈ సీసీటీవీ కెమెరాలు ఫేస్ డిటెక్షన్ పాయింట్‌గా ఉంటాయి.  గుర్తించడం పూర్తయిన తర్వాత, ఫేస్‌ప్రింట్ కంప్యూటర్‌లో సృష్టించబడుతుంది.  చివరగా, ఫేస్‌ప్రింట్ స్థానికంగా మాల్ కంప్యూటర్‌లో నిల్వ చేయబడిన డేటాబేస్‌తో సరిపోలుతుంది.  ఫేస్‌ ప్రింట్ తగిన ముఖ లక్షణాలను మరియు విన్యాసాన్ని విస్తృతంగా కలిగి ఉంటుంది.


ఈ సాంకేతిక పరిజ్ఞాన పరిచయమే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట యమపాశమై చుట్టుకొంది. ఉపాధ్యాయుల సెల్ ఫోన్ నుంచే హాజరును సేకరించే వ్యవస్థ ఆగష్టు నెల నుంచీ అమల్లోకి వచ్చింది. అయితే మూడు నెలలు దాటినా బాల్యారంభ దోషాలను అధిగమించడం లేదు. ప్రపంచ బ్యాంకు దృష్టిలో ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యా వ్యవస్థను నిర్వహిస్తున్నామని చాటుకు ఉబలాటంలో ఉన్న ప్రభుత్వానికి వాస్తవ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు.  ఒకవైపు ఇంటర్నెట్ సమస్య, మరోవైపు యాప్ లో లోపాలు మానసిక వేదనను సృస్తిస్తున్నాయి. తొలి ప్రయత్నంలో హాజరు సకాలంలో నమోదుకాక మానసికంగా ఉద్వేగానికి గురవుతున్నారు. హాజరు వేసే ప్రతీసారీ సింక్ చేయాల్సిరావడం, నిర్ణీత పని ప్రదేశంలో లేరని, బాక్స్ లొనే ముఖం ఉంచాలనడం, నవ్వులు కోరడం, కళ్ళు బ్లింక్ చేయమనడం వంటి సందేశాలు ప్రత్యక్షమై యాప్ కోతిని చేసి అందిస్తోంది. ఉపాధ్యాయుల విద్యార్థుల సమక్షంలో అష్ట వంకరలు తిరిగి చేస్తున్న విన్యాసాల వల్ల విపరీతమైన కాలహరణమవుతోంది.   ఇక సెలవుల నమోదుపై స్పష్టత లేదు. రెండుపూటలా సెలవు పెట్టి తొలి పూట గానీ రెండో పూట గానీ కార్యస్థానానికి హాజరైనప్పటికీ మీరు సెలవులో వున్నారు, మీ హాజరు నమోదు కాదంటూ మెసేజ్ వస్తోంది. కొన్ని పర్యాయాలు అసలు ఫోటోలోని వ్యక్తి మీరు కాదంటోంది. ప్రభుత్వానికి,  సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న సంస్థలకు మధ్య ఒడంబడిక ఏంటో తెలీదు కానీ ఫలితాలను చవిచూస్తున్నది ఉపాధ్యాయులే!  సమస్యలు పరిష్కారించడానికి ఏర్పాటైన హెల్ప్ డెస్క్ కూడా ఏమీ చెప్పలేక పోతోంది. డీడీఓ లాగిన్ కూడా లోపభూయిష్టంగా ఉంది. సెలవుల సంఖ్య కూడా ఇతిమిద్దంగా లేవు. అసలు ముఖ ఆధారిత హాజరు నమోదును ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో తిరస్కరించినా కొన్ని సంఘాలు ప్రభుత్వ పెద్దల వద్ద నోరు మెడపలేక నాలుక వెనక్కు ముడుచుకొని వచ్చాయి. ఇది వాస్తవం. పోనీ పోరాటాలకు ఉపాధ్యాయులు సంసిద్ధులుగా లేరంటూ సుద్దులు చెప్పినా చావుతప్పి కన్ను లొట్టబోయి నిరంకుశ విధానాలను అంగీకారాన్ని తెలిపారు. సరే అనుకున్నా, యాప్ లోపాలతో ఉపాధ్యాయులను విసిగిస్తోంది, వేధిస్తోంది,  గుండు చేయించుకున్న వారికి యాప్ చుక్కలు చూపిస్తోంది.


పాఠశాలల నిర్వహణ పూర్తిగా యాప్ లపై ఆధారపడి ఉన్న దృష్ట్యా తగిన సామగ్రి సంపత్తిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యత. లేదంటే ఉపాధ్యాయులు మానసిక వికలాంగులయ్యే ప్రమాదం ఉంది

ప్రభుత్వం ఇప్పటికైనా పాఠశాలలకు పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ యంత్రాలను సరఫరా చేయడంతో పాటు ప్రాంగణంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. 


- మోహన్ దాస్, ఎపిటీఎఫ్.

సర్కులర్ నం. 172/ A&I/ 2020 పూర్తిగా అశాస్త్రీయ మైనది, ఆచరణ సాధ్యం కానిది: ఏపీటీఎఫ్ విజయనగరం శాఖ

సర్కులర్ నం. 172/ A&I/ 2020 పూర్తిగా అశాస్త్రీయ మైనది, ఆచరణ సాధ్యం కానిది: ఏపీటీఎఫ్ విజయనగరం శాఖ

Mohan
APTF Updated at: June 02, 2021

ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలందరికీ 
ఉధ్యమాభివందనాలు.

__ మిత్రులారా! 

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ 31-5-2021 నాడు విడుదల చేసిన సర్కులర్ నం. 172/ A&I/ 2020 పూర్తిగా అశాస్త్రీయ మైనది, ఆచరణ సాధ్యం కానిది. పాఠశాల విద్యా రంగాన్ని సమూలంగా మార్చడానికి ( దీని నేపథ్యం జాతీయ విద్యా విధానం - 2020) ఉద్దేశించబడిన ఈ సర్కులర్ మన రాష్ట్ర పాఠశాల విద్యా రంగాన్ని మరింతగా సంక్షోభం లోనికి నెట్టివేస్తుంది. ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, విద్యా వేత్తలతో ఏమాత్రం వివరంగా చర్చించ కుండా ఆగమేఘాల మీద విడుదల చేసిన ఈ సర్కులర్ వల్ల  ప్రాథమిక విద్య, సెకండరీ స్కూల్ విద్య అమలు మరింత గందరగోళానికి దారితీస్తుంది. అంగన్ వాడి వ్యవస్థ నిర్వీర్య మై పోతుంది. పూర్వ ప్రాథమిక విద్యను బలో పేతం చేయడమే ప్రభుత్వ సంకల్పం అయితే, ప్రస్తుతం వున్న ప్రాథమిక పాఠశాలల పరిధిలోనే  పాఠశాలలకు అనుబంధంగా ECCE  కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కొఠారి కమిషన్, విద్యా హక్కు చట్టం - 2009  చెబుతున్నాయి. మరియు ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్నాయి. ఉన్న ప్రాథమిక తరగతులను ( 1- 5 తరగతులు) విడదీసి విడి విడిగా, వేరు వేరు ప్రాంతాలలో నిర్వహించడం అశాస్త్రీయం. అది కూడా ఓకే SGT ఉపాధ్యాయుని తో నిర్వహించాలని సూచించడం దారుణం. సర్కులర్ ప్రకారం తరగతుల వర్గీకరణ, ఉపాధ్యాయుల వర్గీకరణ, శాస్త్రీయంగా వున్నాయి. ఒక తరగతి కి ఒక ఉపాధ్యాయుడు అన్న విద్యా హక్కు - 2009 సూత్రాలకు భిన్నంగా ఈ నిబంధనలు ఉన్నాయి. 6 పేజీల నిడివిగల ఈ సర్కులర్ నిండా సాంకేతిక, అద్భుతమైన డాంభిక  సామాన్య మానవులకు అర్థం కాని పదజాలం వుంది. ఈ పదాల అర్థం సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం కాని పదజాలాన్ని వినియోగించి, చదివిన వారిని గందరగోళ పరిచేలా వుంది తప్ప, ఆచరణ లో ఇబ్బందులే వుంటాయి. ప్రభుత్వ విద్య పేద బడుగు వర్గాల వారికి దూరం చేసేలా వుంది. పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య , సెకండరీ విద్య ల వర్గీకరణ శాస్త్రీయ బద్దంగా లేదు. విద్యారంగ శాశ్విత మార్పులకు ఉద్దేశింప బడిన ఈ ఉత్తర్వులను ఇంత తొందరగా ఈ కరోనా కష్ట కాలంలో తీసుకు రావలసిన అవసరం లేదు. ఈ కరోనా మహమ్మారి కాలంలో  దేశ వ్యాప్తంగా విద్యా రంగం మొత్తం సంక్షోభంలో వుంది. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద మైన ఈ జాతీయ విద్యా విధానం - 2020 అమలుకు ఈ కరోనా సంక్షోభ కాలాన్ని ఒక అవకాశం గా వాడుకోవాలని చూస్తున్నది. రాష్ట్రా ల హక్కులను హరించి వేసి, దేశ ఫెడరల్ సూత్రాలకు భిన్నంగా తీసుకు వస్తున్న ఈ జాతీయ విద్యా విధానం - 2020 ని రాష్ట్ర ప్రభుత్వాలు అనాలోచితంగా తొందరపడి అమలుచేస్తున్నాయి. ఈ విషయంలో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరి ఒకడుగు ముందుకు వేసి, ఈ సర్కులర్ ను జారీ చేసింది.

  అసలు ఇంత పెద్ద మార్పులకు ఉద్దేశించిన ఈ విధానాలను ఒక G.O. గా ( పటిష్ఠ మైన ప్రభుత్వ ఉత్తర్వులు) కాకుండా సర్కులర్ రూపంలో విడుదల చేసింది. దీన్ని ఎవరైనా న్యాయస్థానంలో సవాలు చేస్తే రద్దు చేయబడుతుంది.

        ___ మిత్రులారా, ఉపాధ్యాయ సంఘాలుగా, విద్యార్థి సంఘాల బాధ్యులుగా మొత్తం సమాజానికి, విద్యారంగానికి, ఉపాధ్యాయ వర్గానికి బాధ్యత వహించ వలసిన మనం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సర్కులర్ ను తిరస్కరించాలి. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చి, ఈ మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో, విద్యా వేత్తలతో, ఉపాధ్యాయ MLC లతో, తల్లిదండ్రులలో చర్చించిన అనంతరం, కరోనా సంక్షోభం అనంతరం, అందరికీ ఆమోద యోగ్యమైన విధంగా అమలు చేసేలా చూడవలసిన బాధ్యత మనపై వుంది. ఈ సర్కులర్ రద్దు కొరకు మనందరం డిమాండ్ చేయాలి. మన మన క్యాడర్ ను ఈ విషయంలో చైతన్యం చేసుకోవాలి. MLC లపై ఒత్తిడి తీసుకు రావాలి. ఆ దిశగా సోదర ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రయత్నించ వలసిందిగా మినమ్రంగా మిమ్ముగా కోరుతున్నాను.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |