ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలందరికీ
ఉధ్యమాభివందనాలు.
__ మిత్రులారా!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ 31-5-2021 నాడు విడుదల చేసిన సర్కులర్ నం. 172/ A&I/ 2020 పూర్తిగా అశాస్త్రీయ మైనది, ఆచరణ సాధ్యం కానిది. పాఠశాల విద్యా రంగాన్ని సమూలంగా మార్చడానికి ( దీని నేపథ్యం జాతీయ విద్యా విధానం - 2020) ఉద్దేశించబడిన ఈ సర్కులర్ మన రాష్ట్ర పాఠశాల విద్యా రంగాన్ని మరింతగా సంక్షోభం లోనికి నెట్టివేస్తుంది. ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, విద్యా వేత్తలతో ఏమాత్రం వివరంగా చర్చించ కుండా ఆగమేఘాల మీద విడుదల చేసిన ఈ సర్కులర్ వల్ల ప్రాథమిక విద్య, సెకండరీ స్కూల్ విద్య అమలు మరింత గందరగోళానికి దారితీస్తుంది. అంగన్ వాడి వ్యవస్థ నిర్వీర్య మై పోతుంది. పూర్వ ప్రాథమిక విద్యను బలో పేతం చేయడమే ప్రభుత్వ సంకల్పం అయితే, ప్రస్తుతం వున్న ప్రాథమిక పాఠశాలల పరిధిలోనే పాఠశాలలకు అనుబంధంగా ECCE కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కొఠారి కమిషన్, విద్యా హక్కు చట్టం - 2009 చెబుతున్నాయి. మరియు ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్నాయి. ఉన్న ప్రాథమిక తరగతులను ( 1- 5 తరగతులు) విడదీసి విడి విడిగా, వేరు వేరు ప్రాంతాలలో నిర్వహించడం అశాస్త్రీయం. అది కూడా ఓకే SGT ఉపాధ్యాయుని తో నిర్వహించాలని సూచించడం దారుణం. సర్కులర్ ప్రకారం తరగతుల వర్గీకరణ, ఉపాధ్యాయుల వర్గీకరణ, శాస్త్రీయంగా వున్నాయి. ఒక తరగతి కి ఒక ఉపాధ్యాయుడు అన్న విద్యా హక్కు - 2009 సూత్రాలకు భిన్నంగా ఈ నిబంధనలు ఉన్నాయి. 6 పేజీల నిడివిగల ఈ సర్కులర్ నిండా సాంకేతిక, అద్భుతమైన డాంభిక సామాన్య మానవులకు అర్థం కాని పదజాలం వుంది. ఈ పదాల అర్థం సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం కాని పదజాలాన్ని వినియోగించి, చదివిన వారిని గందరగోళ పరిచేలా వుంది తప్ప, ఆచరణ లో ఇబ్బందులే వుంటాయి. ప్రభుత్వ విద్య పేద బడుగు వర్గాల వారికి దూరం చేసేలా వుంది. పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య , సెకండరీ విద్య ల వర్గీకరణ శాస్త్రీయ బద్దంగా లేదు. విద్యారంగ శాశ్విత మార్పులకు ఉద్దేశింప బడిన ఈ ఉత్తర్వులను ఇంత తొందరగా ఈ కరోనా కష్ట కాలంలో తీసుకు రావలసిన అవసరం లేదు. ఈ కరోనా మహమ్మారి కాలంలో దేశ వ్యాప్తంగా విద్యా రంగం మొత్తం సంక్షోభంలో వుంది. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద మైన ఈ జాతీయ విద్యా విధానం - 2020 అమలుకు ఈ కరోనా సంక్షోభ కాలాన్ని ఒక అవకాశం గా వాడుకోవాలని చూస్తున్నది. రాష్ట్రా ల హక్కులను హరించి వేసి, దేశ ఫెడరల్ సూత్రాలకు భిన్నంగా తీసుకు వస్తున్న ఈ జాతీయ విద్యా విధానం - 2020 ని రాష్ట్ర ప్రభుత్వాలు అనాలోచితంగా తొందరపడి అమలుచేస్తున్నాయి. ఈ విషయంలో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరి ఒకడుగు ముందుకు వేసి, ఈ సర్కులర్ ను జారీ చేసింది.
అసలు ఇంత పెద్ద మార్పులకు ఉద్దేశించిన ఈ విధానాలను ఒక G.O. గా ( పటిష్ఠ మైన ప్రభుత్వ ఉత్తర్వులు) కాకుండా సర్కులర్ రూపంలో విడుదల చేసింది. దీన్ని ఎవరైనా న్యాయస్థానంలో సవాలు చేస్తే రద్దు చేయబడుతుంది.
___ మిత్రులారా, ఉపాధ్యాయ సంఘాలుగా, విద్యార్థి సంఘాల బాధ్యులుగా మొత్తం సమాజానికి, విద్యారంగానికి, ఉపాధ్యాయ వర్గానికి బాధ్యత వహించ వలసిన మనం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సర్కులర్ ను తిరస్కరించాలి. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చి, ఈ మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో, విద్యా వేత్తలతో, ఉపాధ్యాయ MLC లతో, తల్లిదండ్రులలో చర్చించిన అనంతరం, కరోనా సంక్షోభం అనంతరం, అందరికీ ఆమోద యోగ్యమైన విధంగా అమలు చేసేలా చూడవలసిన బాధ్యత మనపై వుంది. ఈ సర్కులర్ రద్దు కొరకు మనందరం డిమాండ్ చేయాలి. మన మన క్యాడర్ ను ఈ విషయంలో చైతన్యం చేసుకోవాలి. MLC లపై ఒత్తిడి తీసుకు రావాలి. ఆ దిశగా సోదర ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రయత్నించ వలసిందిగా మినమ్రంగా మిమ్ముగా కోరుతున్నాను.